ఎట్టకేలకు తెలంగాణ ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆమోదం లభించింది. ఇటీవల కొంత కాలం పాటు రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతి భవన్ నడిచిన విషయం తెలిసిందే. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, గవర్నర్‌కు వివాదం తలెత్తింది. ఇక అప్పటి నుంచి ఆమె తెలంగాణ ప్రభుత్వంతో సై అంటే సై అన్నట్టుగానే ఉన్నారు. ఆమె ముందుగా తాను ఆమోదించాల్సిన కొన్ని బిల్లులను పలు కారణాలు చెప్పి వెనక్కి తిప్పి పంపించేశారు. దీంతో సీఎం కేసీఆర్‌కు గట్టిగానే ట్రిగ్గర్ చేసినట్టు అయ్యింది. ఇక ఆ తరువాత కేసీఆర్ సైతం గవర్నర్ అధికారిక కార్యక్రమాలకు సైతం పిలవలేదు. వీరిద్దరి మధ్య వార్ బీభత్సంగానే నడిచింది.
తాజాగా కొన్ని పరిస్థితుల కారణంగా బీఆర్ఎస్, బీజేపీల మధ్య దూరం తగ్గింది. ఈ క్రమంలోనే రాజ్‌భవన్, ప్రగతి భవన్‌ల మధ్య దూరం కూడా తగ్గింది. క్రమక్రమంగా బిల్లుల ఆమోదానికి కూడా తమిళిసై సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం శాసన సభలో బిల్లులను ప్రవేశపెట్టింది. ఆ తరువాత ఆ బిల్లును గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం పంపించింది. దీనిపై ఆమె వివరణ కోరడంతో పాటు 10 సిఫారసులు చేశారు. వీటిపై ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. దీనిపై సంతృప్తి చెందిన తమిళిసై నేడు ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపారు. తాను చేసిన 10 సిఫారసుల విషయంలో ప్రభుత్వ స్పందనపై సంతృప్తి చెందానని గవర్నర్ పేర్కొన్నారు. ఆపై ఆర్టీసీ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.
ప్రజారవాణా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు, సేవలను ఇంకా విస్తృతపరిచేందుకు సంస్థలో పనిచేస్తున్న వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఇటీవల మంత్రి మండలి నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించే అంశంలో బిల్లు తీసుకొచ్చినప్పుడు తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తమ సంస్థను కూడా ప్రభుత్వపరం చేయాలంటూ సమ్మె చేశారు. ప్రస్తుతం ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ఈ సానుకూల నిర్ణయం వెలువరించింది. దీనిపై విధివిధానాలు, నిబంధనలను రూపొందించేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఆర్‌అండ్ బీ, రవాణాశాఖ, జీఏడీ శాఖ కార్యదర్శులు, కార్మికశాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఆ తరువాత గవర్నర్ ఆమోదానికి పంపింది. నేడు గవర్నర్ ఆమోదం కూడా లభించడంతో ఆర్టీసీ ఉద్యోగులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.