స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. నేడు ఆయనతో ములాఖత్ కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లారు. చంద్రబాబుతో 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకూ ఈ రెండు పార్టీల పొత్తుపై ప్రచారం జరుగుతోంది కానీ పార్టీ అధినేతల నుంచి మాత్రం అధికారిక ప్రకటన రాలేదు. నేడు పవన్ అధికారిక ప్రకటన ఇచ్చేశారు. ఈ మేరకు నిర్ణయం తీసేసుకున్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
నాలోంటోడిని సరిహద్దులు దాటకుండా ఆపేస్తారా?
రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన చూస్తున్నామని.. పాలసీలు పరంగా భిన్నమైన ఆలోచనలు ఉన్నాయని పవన్ పేర్కొన్నారు. 2014 లో జనసేన ప్రారంభించినప్పుడు ప్రధాని మోదీకి తాను మద్దతు తెలిపానన్నారు. అప్పట్లో ఈ విషయమై తనను చాలా మంది దూషించారన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబుని జైలులో కూర్చోబెట్టడం బాధాకరమన్నారు. అసలు ఈడీ విచారణ లేకుండా చంద్రబాబుని ఎలా జైలులో ఎలా కూర్చోబెడతారని పవన్ ప్రశ్నించారు. ఆర్థిక నేరాల్లో కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అడ్డగోలుగా జగన్ దోచుకుంటున్నాడన్నారు. నాలోంటోడిని సరిహద్దులు దాటకుండా ఆపేస్తారా? అంటూ పవన్ మండిపడ్డారు.
జగన్ నీకు ఆరు నెలలే..
ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వబోనని స్పష్టం చేశారు. వివేకా హత్య కేసులో అన్ని వేళ్ళు మీ వైపే చూపిస్తున్నాయన్నారు. గుజరాత్‌లో పట్టుబడిన హెరాయిన్ కేసుపై ఏపీలో మూలాలున్నా పోలీసులు ఎవరినీ పట్టుకోలేదన్నారు. చంద్రబాబుపై కేసు రాజకీయ ప్రతికారం మాత్రమేనన్నారు. ఈ ములాఖత్ చాలా కీలకమని.. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వెళ్ళాలని తన కోరిక అని పవన్ తెలిపారు. వైసీపీ అరాచకాలను అడ్డుకోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే కుదరదన్నారు. సింహం సింగిల్‌గా వస్తుందని.. కానీ తాము మనుషులమని వైసీపీకి పంచ్ ఇచ్చారు. జనసేన, టీడీపీ కలిసి ఎన్నికలకు వెళ్తాయని ప్రకటించారు. 151 సీట్లు దౌర్జన్యం చేసే ఆర్థిక నేరస్థుడైన జగన్‌కి ఇచ్చామన్నారు. వైసీపీ క్రిమినల్స్‌ను వదలబోమని.. వైసీపీకి అనుకూలంగా ఉండే క్రిమినల్స్‌ను హెచ్చరిస్తున్నానన్నారు. డీజీపీ, చీప్ సెక్రటరీ, అధికారులు దృష్టిలో పెట్టుకోండి. మాజీ ముఖ్యమంత్రికే ఈ పరిస్థితి వస్తే అధికారుల పరిస్థితి తెలుసుకోవాలన్నారు. ‘‘జగన్ నీకు ఆరు నెలలే. యుద్ధమే కావాలంటే యుద్ధమే ఇస్తాం. కచ్చితంగా ఏ ఒక్కర్నీ వదలం. మాజీ ముఖ్యమంత్రినే కూర్చోబెడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకొండి’’ అని పవన్ హెచ్చరించారు.