స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్ వంటి పరిణామాలు తెలిసినవే. అయితే చంద్రబాబు అరెస్ట్‌కి సంబంధించి ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చంద్రబాబు విషయమై ఈ రోజు వరకూ బీజేపీ అసలు పట్టించుకున్నదే లేదు. కనీసం సోషల్ మీడియా వేదికగా కానీ.. మీడియాలో కానీ బీజేపీ అధిష్టానం పెదవి విప్పింది లేదు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో అంటే.. జీ 20 సదస్సు నేపథ్యంలో బీజేపీ అధిష్టానం బిజీగా ఉంది కాబట్టి పట్టించుకోలేదు అనుకున్నా కూడా అది అయిపోయి మూడు రోజులవుతున్నా కనీసం స్పందించిన పాపాన పోలేదు.
అయితే చంద్రబాబు అరెస్ట్ వార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ని ఆ పార్టీ రంగంలోకి దింపిందట. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూద్రా చంద్రబాబు తరుఫున వాదనలు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అసలు సిద్దార్థ్ లూద్రాతో సంప్రదింపులు జరిపిందే డీకే శివకుమార్ అని ఒక టాక్ అయితే నడుస్తోంది. సిద్దార్థ లూద్రాతో సంప్రదింపులు జరపడం నుంచి ఈ కేసుకి సంబంధించి ఏం కావాలో అన్నీ తానై బెంగళూరు నివాసం నుంచి డీకే శివకుమార్ చూసుకున్నారట.
తన అరెస్ట్ వార్తల నేపథ్యంలో చంద్రబాబు శనివారం తెల్లవారుజాము నుంచే కాంగ్రెస్ అధినాయకత్వంతో పాటు డీకే శివకుమార్‌తో ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా టచ్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అరెస్ట్ వంటి పరిణామాల నేపథ్యంలో ఆయనకు అవసరమైన సహాయ సహకారాలన్నీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అందించిందట. సుప్రీంకోర్టు న్యాయవాదిని నియమించడంతో పాటు ఆర్థికపరమైన సహాయ సహకారాలన్నీ డీకే శివకుమార్ అందించారట. ఒకానొక సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో భగ్న శత్రువులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు చంద్రబాబు అరెస్ట్‌తో ఏకమయ్యాయని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.