సినీ ఇండస్ట్రీలో అవకాశవాద రాజకీయాలు ఎక్కువ.. అంటే ఏమో అనుకున్నాం కానీ ప్రస్తుత పరిణామాలన్నీ చూస్తుంటే ఇది నిజమేనని స్పష్టమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ వంటి అంశాలపై ఇద్దరు, ముగ్గురు మినహా స్పందించిన వారే కరువయ్యారు. సొంత వారే స్పందించకుంటే.. వేరొకరు ఎందుకు స్పందిస్తారు.. అంటారా? అది కూడా ఒక పాయింటే. టీడీపీకి కష్టం వస్తే ఎప్పుడే తాను అండగా ఉంటానని ప్రగల్భాలు పలికిన జూనియర్ ఎన్టీఆర్.. పార్టీ అధినేత జైలుకు పోతే స్పందించిందే లేదు. అయితే మాత్రం ఇండస్ట్రీ చంద్రబాబు హయాంలో ఎంత ప్రయోజనం పొందింది? అలాంటిది ఇప్పుడు వీరికి ఏమైంది?
దర్శకధీరుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు నట్టి కుమార్ వంటి ఇద్దరు ముగ్గురు మినహా చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన వారే కరవయ్యారు. నిజానికి సినీ పరిశ్రమ కోసం చంద్రబాబు ఎంతో చేశారు. ఏనాడూ కూడా సినిమా టికెట్స్ విషయంలో ఆంక్షలు విధించిన పాపాన పోలేదు. ఆయన అధికారంలో ఉండగా అది కావాలని.. ఇది కావాలంటూ తమకు అవసరమైన మేలు పొంది ఇప్పుడు ఆయన కష్టంలో ఉన్నప్పుడు సైలెంట్‌గా ఉండటం ఎంత మేరకు న్యాయం? ఇదే విషయాన్ని నట్టికుమార్ సైతం ప్రశ్నించారు. చంద్రబాబుకు మద్దతిస్తే జగన్ ఏమైనా ఉరితీస్తాడా? అని ప్రశ్నించారు. సినీ పరిశ్రమ పెద్దలు దొంగ ముసుగులు వేసుకోవద్దని హితవు పలికారు.
నిజానికి సినీ ఇండస్ట్రీలో మెజారిటీ నటులు ఏపీకి చెందినవారే. పైగా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారే. పైగా నందమూరి ఫ్యామిలీకి అభిమానులు. కనీసం ఇండస్ట్రీ ప్రముఖులు చిరంజీవి, మోహన్‌బాబు, రాజమౌళి, ప్రభాస్ వంటి వారైనా స్పందించవచ్చు కదా.. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇండస్ట్రీ పెద్దలు ఆయనకు చాలా దగ్గరయ్యారు. ఆ తరువాత కొన్ని విభేదాలు వచ్చాయి. థియేటర్లలో టికెట్ ఖర్చుపై వివాదం మొదలైంది. ఎవరూ ఎంత మొత్తుకున్న జగన్ వినలేదు. పైగా మెగాస్టార్ చిరంజీవిని మమంత్రులంతా టార్గెట్ చేశారు. నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఈ క్రమంలోనే జగన్‌తో పెట్టుకుంటే అభాసుపాలవడమే కాదు.. తమ సినిమాలపై కూడా దెబ్బ వేస్తాడన్న భయం ఇండస్ట్రీకి పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీ పెద్దలంతా సైలెంట్ అయినట్టు సమాచారం.