టీడీపీ అధినేత అక్రమ అరెస్ట్, రిమాండ్ వంటి పరిణామాలపై బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ అనంతరం పవన్ వెంటనే ఏపీకి రావాలనుకున్నారు. కానీ ఆయనను ప్రభుత్వం అడ్డుకుంది. మరోవైపు చంద్రబాబును పోలీసులు చాలా ఇబ్బందిపెట్టారు. అసలు ఈ పరిణామాలన్నింటిపై బీజేపీ అధిష్టానం నోరు మెదపలేదు. చాలా కాలంగా బీజేపీ, జనసేన కలిసే ఉన్నాయి. పైగా ఇటీవలి కాలంలో టీడీపీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం పొత్తు అంశంపై ఆలోచించడం లేదని చెబుతున్నారు. మొత్తానికి టీడీపీ, జనసేన, బీజేపీ ఈసారి జత కట్టబోతున్నాయనే వార్తల నడుమ చంద్రబాబు విషయంలో బీజేపీ అధిష్టానం స్పందించకపోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ క్రమంలోనే బీజేపీతో పవన్ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. పోనీ చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ వంటి అంశాలపై బీజేపీ అధిష్టానం స్పందించకుంటే ఓకే కానీ.. గత కొంతకాలంగా బీజేపీతో కలిసి నడుస్తున్న జనసేనాని విషయంలో కూడా స్పందించకపోవడం ఆశ్చర్యం రేకెత్తిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీకి రావాలనుకున్న పవన్‌ను బేగంపేట ఎయిర్‌పోర్టులో అడ్డుకోవడం.. ఆ తరువాత కూడా రోడ్డు మార్గంలో ఏపీకి చేరుకునేందుకు యత్నిస్తే.. తెలంగాణ సరిహద్దుల్లో అర్ధరాత్రి సైతం అడ్డుకోవడం వంటి పరిమాణాలు తెలిసి కూడా బీజేపీ అధిష్టానం సైలెంట్‌గా ఉండిపోవడం వంటి అంశాలు ఆయనకు ఆగ్రహం తెప్పించాయి. అసలే వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, బీజేపీని ఏకం చేసేందుకు యత్నిస్తున్న పవన్‌కు తాజా పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి.
బీజేపీ పెద్దల అపాయింట్‌మెంటు దొరికిన వెంటనే పవన్ ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం. చంద్రబాబు అరెస్ట్ అనంతరం కనీసం బంద్‌లో కూడా బీజేపీ పాల్గొనలేదు. ప్రస్తుతం ఈ వ్యవహారం బీజేపీ - జనసేన పొత్తుపై కూడా ప్రభావం చూసే అవకాశం ఉందని టాక్. వైసీపీకి మద్దతుగా బీజేపీ ఉండే పక్షంలో పవన్ ఆ పార్టీలో తెగదెంపులు చేసుకునే అవకాశం ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కోసం ఇన్నాళ్లూ యత్నించిన పవన్‌కు బీజేపీ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడం షాకింగే. ఒకరకంగా బీజేపీ సైలెంట్‌గా ఉండటం.. బంద్ వంటి కార్యక్రమాలకు కూడా ఆ పార్టీ నేతలు దూరంగా ఉండటం వంటి అంశాలను చూస్తుంటే వైసీపీకి ఆ పార్టీకి అండగా ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పవన్.. ఢిల్లీ పెద్దలతో తాడో పేడో తేల్చుకోనున్నారని సమాచారం.