జగన్.. నువ్వు జైలుకు వెళ్తే అందరూ జైలుకు వెళ్లాలా..? అసెంబ్లీ నిర్ణయాన్ని తప్పుబడుతూ చంద్రబాబును జైలుకు పంపారు. వారాహి యాత్రపై దాడికి 2వేల మంది నేరగాళ్లను దింపారు. కోనసీమ జిల్లాలో 50 మందిని చంపాలని కుట్ర చేశారు. వైసీపీ మూకల కుట్ర తెలిసి కేంద్ర పెద్దలు దాన్ని నిలువరించారు.. ఇవీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు.
జాగ్రత్త జగన్!
తెలంగాణలో జగన్‌ను రాళ్లతో తరిమికొట్టారని, రేపు ఏపీలోనూ అదే పరిస్థితి రావొచ్చని పవన్ అన్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల పాటు జైలుకు వెళ్లిన వ్యక్తి.. రిచెస్ట్ సీఎం.. కానీ ఆయన ఏం పని చేశాడో తెలియదని అన్నారు. హఠాత్తుగా ఆస్తులు పెంచేసుకుని, అక్రమంగా డబ్బులు సంపాదించిన వారంతా రాజ్యాధికారం దక్కించుకున్నారని మండిపడ్డారు. ప్రతి ఒక్కరినీ నేరగాళ్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ పవన్ ఆరోపించారు. చంద్రబాబును అరెస్టు చేసిన అంశంలో తన మద్దతు ఆయనకు ఉంటుందని స్పష్టంగా చెప్పానన్నారు. గతంలో విశాఖపట్నంలో గొడవ జరిగిన సమయంలో తనకు మద్దతుగా నిలిచిన చంద్రబాబుకు తిరిగి ఆయనకు మద్దతుగా నిలవడం అనేది సంస్కారమన్నారు. తన కోసం నిలబడిన వ్యక్తికి మద్దతు ఇవ్వడం మన బాధ్యత అని పవన్ పేర్కొన్నారు. తాను చంద్రబాబును కలిసేందుకు వస్తానని ప్రచారం చేసి లా అండ్ ఆర్డర్ సమస్యలను సృష్టించిందే వైసీపీ నేతలు అని తెలిపారు.
నేనేం చేశా జగన్!
అంతకు ముందు జనసేన పీఎసీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు, జిల్లా అధ్యక్షులతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. పార్టీ నాయకులు చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టేలా డిజైన్ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ మూడు విడతలు వారాహి యాత్రను నిర్వహించిన పవన్.. నాలుగో విడత వారాహి యాత్రను కృష్ణా జిల్లాలో ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. తనను నిన్న ఏపీకి రాకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని.. కృష్ణాజిల్లా ఎస్పీతో లేఖ ఇప్పించి... లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెప్పించారన్నారు. తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయనని.. కేవలం గట్టిగా మాట్లాడటమే తప్పా అని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా ఎస్పీ లేఖను చూసి తాను బాధపడ్డానని పవన్ వెల్లడించారు. తనకు ఉన్న హక్కును హరించేలా.. ప్రభుత్వం, పోలీసులు ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. ఒక పార్టీ అధినేత అయిన తనకు బాధ్యతలు తెలియవా? అని నిలదీశారు. నిన్న జరిగిన ఘటనలన్నీ తనకు చాలా కష్టం కలిగించాయని.. అసలు తన పార్టీ ఆఫీసుకు వెళ్లేందుకు ఎవరి పర్మిషన్ తీసుకోవాలని ప్రశ్నించారు.