శ్రీకాకుళంలో వైసీపీకి భారీ షాక్ తగలనుంది. పార్టీకి చెందిన కీలక నేత ఫ్యాన్‌ను గాలికొదిలేసి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారని టాక్. వైసీపీ మహిళా నాయకురాలు కిల్లి కృపారాణి వైసీపీని వీడబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఆమె త్వరలోనే టీడీపీలో జాయిన్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. కిల్లి కృపారాణి చాలా కాలంగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున శ్రీకాకుళం ఎంపీగా విజయం సాధించి కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తరువాత తెలంగాణ, ఏపీ విడిపోయిన తరుణంలో వచ్చిన ఎన్నికల్లో అంటే 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఇంత అవమానమా..?
సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. కానీ వైసీపీలో ఆమెకు తగిన ప్రాధాన్యం దక్కలేదు. 2019లో శ్రీకాకుళం ఎంపీ సీటును ఆశ్రయించారు. కానీ దానిని పార్టీ అధినేత జగన్.. దువ్వాడ శ్రీనివాస్‌కు కేటాయించారు. అయినా కూడా ఆమె వైసీపీలోనే కొనసాగారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి లేదా రాజ్యసభ సీటు దక్కుతుందని ఆశించారు కానీ నో యూజ్. పోనీ వచ్చే ఎన్నికల్లో అయినా ప్రాధాన్యం ఇస్తారా? అంటే అదీ లేదు. కనీసం టెక్కలి లేదా నరసన్నపేట అసెంబ్లీ టికెట్ కూడా ఇవ్వలేమని వైసీపీ అధిష్టానం తేల్చేసిందట. ఇది ఒకరకంగా కిల్లి కృపారాణికి అవమానమే అని చెప్పుకోవచ్చు. దీంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు తీవ్ర నిరాశకు లోనయ్యారట. ప్రాధాన్యత ఇవ్వనప్పుడు.. ఇన్నేళ్లు వేచి చూసినా కనీసం ఏదో ఒకటి టికెట్ ఇవ్వడానికి అధిష్టానం సిద్ధంగా లేనప్పుడు పార్టీలో ఉండటం అవసరమా..? టికెట్ హామీ ఇచ్చేపార్టీలోకి వెళ్లాలని ఒత్తిడి తెస్తున్నారట.
ఇవన్నీ అవసరమా..?
ఇవన్నీ చాలవన్నట్టు ఇటీవల సీఎం జగన్ శ్రీకాకుళంలో పర్యటించిన సమయంలో కిల్లి కృపారాణి హెలిప్యాడ్ వద్దకు వెళ్లేందుకు యత్నించినా కూడా పోలీసులు అడ్డుకున్నారు. సీఎంకు ఆహ్వానం పలికే నాయకుల జాబితాలో ఆమె పేరు లేదని చెప్పడంతో అవాక్కయ్యారు. ఇంతకన్నా అవమానం మరొకటి ఉంటుందా? దీంతో ఆమె ప్రస్తుతం టీడీపీ వైపు చూస్తున్నారని టాక్. టీడీపీ నుంచి ఆమెకు ఎంపీ సీటు దక్కే అవకాశాలు ఉండటంతో ఆమె టీడీపీ వైపు చూస్తున్నట్టు టాక్. వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు నరసన్నపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తనకు శ్రీకాకుళం ఎంపీ స్థానం ఇవ్వాలంటూ టీడీపీ కీలక నేతలతో కిల్లి కృపారాణి చర్చలు జరిపారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ కూడా ఆమె పార్టీలో చేరితే టికెట్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉందని టాక్. ఫైనల్‌గా కిల్లీ మేడమ్ ఏం చేస్తారో చూడాలి మరి.