స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలోనే పెద్ద ఎత్తున పోలీసులు గంటా నివాసానికి చేరుకున్నారు. దిశ ఏసీపీ వివేకానంద నేతృత్వంలో పోలీసులు గంటా శ్రీనివాసరావుతో పాటు ఆయన కుమారుడు రవితేజని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిద్దరినీ ఎండాడలోని దిశ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
మాజీ మంత్రి, ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడు రవితేజని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు. ఆయనను అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన చంద్రబాబును అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. అర్థరాత్రి హైడ్రామా క్రియేట్ చేసి మరీ జగన్ మోహన్ రెడ్డి ఆనందం కోసం మాత్రమే చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు.
కేవలం జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళారనే అక్కసుతోనే చంద్రబాబును అరెస్ట్ చేయించినట్టు ఉందని గంటా అన్నారు. గతంలో జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారని.. అతని లాగే అందర్నీ జైలుకు పంపించాలని కక్షతో ఇలాంటి అరెస్టులకు పూనుకుంటున్నారన్నారు. జగన్ చేస్తున్న పనులకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదన్నారు. అమరావతి భూముల విషయంపై మొదటిసారి తన పేరు కూడా చేర్చారన్నారు. ఈ నేపథ్యంలో తాను ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని గంటా తెలిపారు.