కోలీవుడ్ నటుడు విశాల్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో కనిపిస్తూనే ఉంటాడు. నడిగర్ సంఘం ఎన్నికలప్పుడే కాదు మిగతా విషయాల్లోనూ విశాల్ కాస్త దూకుడు స్వభావంతోనే కనిపిస్తాడు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ తో బ్రేకప్ అయ్యాక మరో అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకుని దానిని కూడా బ్రేకప్ చేసుకున్నాడు. ఈ మధ్యన పెళ్లిపై పలు రకాల రూమర్స్ వినిపించినా వాటిని కొట్టిపారేసిన విశాల్ తాజాగా తమిళ నిర్మాతలపై చేసిన వ్యాఖ్యలు దుమ్ము దుమారాన్ని రేపుతున్నాయి..
కోలీవుడ్ లో కొందరు నిర్మాతల వ్యవహారశైలి వల్ల సినిమా ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందంటూ విశాల్ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. అసలు తాను నిర్మాతగా మారడానికి కూడా కొందరు నిర్మాతల వ్యవహరించిన తీరే కారణమని చెప్పాడు. తాను హీరోగా నటించిన సినిమాలు రిలీజ్ అయ్యే సమయానికి నిర్మాతలు తనని కావాలని ఇబ్బంది పెట్టేవారని... శుక్రవారం సినిమా రిలీజ్ అంటే గురువారం రాత్రి తనను బ్లాక్ మెయిల్ చేసేవారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
సదరు నిర్మాతలు ఫైనాన్సియర్ కి డబ్బులు చెల్లించలేదని, సినిమా రిలీజ్ కాదని చెప్పి, తనతో డబ్బులు కట్టించేవారని... అదే కాకుండా సరిగ్గా రెమ్యునరేషన్ కూడా ఇచ్చే వాళ్లు కాదని మండిపడ్డాడు. ఇటువంటి ఇబ్బందులు తాను ఎన్నో పడ్డాను కాబట్టే తాను నిర్మాతగా మారానని చెప్పాడు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై మంచి కథలని ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ నిర్మాతగా లాభపడినట్లుగా చెప్పుకొచ్చాడు. మరి విశాల్ ఈ వ్యాఖ్యలపై తమిళ నిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.