ఏపీలో సార్వత్రిక ఎన్నికలు చర్నకోలు పట్టుకుని మరీ తరుముకొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీలన్నీ ముఖ్యంగా సంస్థాగతంగా బలపడాలి. లేదంటే పరిస్థితులు తలకిందులైపోతాయి. టీడీపీ నేతలు మాత్రం ఇవేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. పలు జిల్లాల్లో పార్టీని ఏకతాటిపై నడిపించే నాయకులే కరువయ్యారు. దీంతో నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అధిష్టానం చూసుకుంటుందిలే అని జిల్లా నాయకత్వం పార్టీ బలోపేతం కానీ.. అంతర్గత సమస్యలను క్లియర్ చేయడం వంటివేమీ చేయడం లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికి వస్తే అధికార పార్టీ అక్రమాలకు అంతూ పొంతూ లేదు. ఇసుక తవ్వకాల్లో అవినీతి తారాస్థాయికి చేరినా కూడా టీడీపీ నేతలు మిన్నకుండిపోయారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే ఈ జిల్లా నేతలు పెద్దగా పట్టించుకున్నది లేదు.
కర్నూలు జిల్లాలో మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి యాక్టివ్‌గా ఉన్నంతకాలం పార్టీలో సమస్యలే కనిపించేవి కావు. కానీ వయోభారం కారణంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో జిల్లాలో నాయకత్వలేమి స్పష్టం గా కనిపిస్తోంది. నంద్యాల జిల్లాలో మాజీ మంత్రి అఖిలప్రియ వర్సెస్ రాష్ట్ర విత్తనాభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి మధ్య గొడవలు రావణ కాష్టంలా రగులుతూనే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి అర జిల్లాలు మినహా ప్రతి జిల్లాలోనూ కీలక నేతలు అసలు పట్టించుకోవడం లేదు. ఆ ఒకటి అరలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒకటి. ఇక్కడ మాత్రం సమస్య వస్తే.. కలిసి పోరాడుతారు. సమస్యలపై చర్చించుకుని ఏకతాటిపై నిలుస్తారు. ఇక ఇతర జిల్లాల విషయానికి వస్తే.. అధినేత చంద్రబాబుకు చెప్పి నేతలు సైలెంట్ అయిపోతున్నారు.
ఇక టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కూడా తమ నియోజకవర్గాలకే పరిమితం కావడం తప్ప జిల్లాల్లో అందరినీ కలిపి సమష్టి నాయకత్వం ఇచ్చే ప్రయత్నం చేయడం లేదన్న టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా ఉన్న ఓటర్ల జాబితాలోని అవకతవకలపై నేతలు పెద్దగా పట్టించుకుంటున్నట్టు కూడా లేదు. ఇది పార్టీకి అత్యంత నష్టం చేకూర్చే అంశాల్లో ఒకటి. రాష్ట్రంలో అధికార పార్టీ చేస్తున్న అక్రమాలు కోకోల్లలు. వాటిపై స్పందించే వారే కరువయ్యారు. కనీసం ఏ విషయంలోనూ అధికార యంత్రాంగంపై పోరాడుతున్న పాపాన పోవడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే టీడీపీకి మున్ముందు కూడా గడ్డుకాలమే. అసలే ఇప్పుడు టీడీపీ విజయానికి అన్నీ డోర్లు ఓపెన్ అయ్యాయి. చేజేతులా పార్టీ నేతలే ఆ డోర్స్‌ను క్లోజ్ చేస్తే చేయగలిగిందేమీ లేదు. ఇప్పటికైనా చంద్రబాబు పట్టించుకుని పార్టీ సంస్థాగత బలోపేతం దిశగా నాయకులను నడిపించకుంటే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.