కోళ్లందు ఏపీ కోళ్లు వేరయా..! ప్రపంచంలో ఎక్కడైనా కోళ్లు 20 రోజుల పాటు పొదిగి పిల్లల్ని చేస్తే.. ఏపీలో మాత్రం ఎళ్లకేళ్లు పొదుగుతూనే ఉంటుంది. ఇది మేము చెప్పిన మాట కాదండోయ్.. అప్పుడెప్పుడో ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఆయన గారి దగ్గర ఆయన శాఖ గురించి అడిగి చూస్తే చాలు.. కోడి గుడ్డు పెట్టిందని ఇంకా పొదగాలని ఏవేవో చెబుతుంటారు తప్ప ఐటీ గురించి ముక్క కూడా మాట్లాడరు. అసలు ఆయనకు తెలిస్తేనే కదా... అంటారా? ఏమోనండీ మాకు కనపడదు. ఎక్కువ మాట్లాడితే.. తెలంగాణ ఐటీ మంత్రి మాదిరిగా కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ దేశ విదేశాలు తిరగాల్సిన అవసరం మాకు లేదు.. మా కాళ్ల దగ్గరికే పరిశ్రమలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి అంటారు.
అసలు ఏపీ మంత్రిని తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పోలుస్తూ అక్కడి ప్రజానీకం గుడివాడ అమర్‌నాథ్‌ను ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. అయినా సరే తగ్గేదే లే.. కోడి పొదగాల్సిందే. తాజాగా తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ బృందం గల్ఫ్ దేశాల నుంచి పెట్టుబడులు రాబట్టింది. నిజంగా ఆ పెట్టుల వివరాలు చూస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం. 1. అగ్నిమాపక పరికరాలను తయారుచేసే నాఫ్కో: రూ.700 కోట్లు పెట్టుబడి. 2. యూఏఈలో ప్రముఖ పోర్ట్ ఆపరేటర్ డీపీ వరల్డ్: రూ.165 కోట్ల పెట్టుబడితో పాటు మరో రూ.50 కోట్ల పెట్టుబడితో మేడ్చల్లో భారీ కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌస్ ఏర్పాటు. 3. లులూ గ్రూప్: రూ.1,000 కోట్ల పెట్టుబడితో రాజన్న సిరిసిల్లా జిల్లాలో భారీ కోల్డ్ స్టోరేజ్, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయబోతోంది. 4. మలబార్ గ్రూప్: రూ.125 కోట్ల పెట్టుబడితో ఫర్నీచర్ తయారీ పరిశ్రమను ఏర్పాటుచేయబోతోంది.
మొత్తంగా ఒక్కరోజు పర్యటనతో కేటీఆర్ రూ.1990 కోట్లు పెట్టుబడి తీసుకొచ్చారు. పైన చెప్పిన లులూ గ్రూప్ ఉందే. గతంలో చంద్రబాబు హయాంలో ఈ సంస్థను ఏపీకి తీసుకొచ్చారు. అయితే చంద్రబాబు తీసుకొచ్చిన సంస్థ మాకెందుకు అనుకున్నారో ఏమో కానీ జగన్ ప్రభుత్వం తరిమేసింది. మరి తెలంగాణ మంత్రి ఇంత చేస్తే.. ఐటీ మంత్రి తన శాఖ గురించి తప్ప ప్రపంచంలోని అన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా కూడా వెంటనే సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోల్ అయిపోతుంటారు. పెట్టుబడుల కోసం మనం ఇతర దేశాల చుట్టూ తిరగక్కరలేదని.. జగన్ ఇమేజ్ చూసి దేశ విదేశీ సంస్థలు పరిగెత్తుకొచ్చి మరీ ఏపీలో రూ.16.56 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాయని చెబుతున్నారు. నమ్మితే నమ్మండి.. గాడిద గుడ్డేం కాదు అనుకుంటే అనుకోండి.