ఆంధ్ర - తెలంగాణ విడిపోయిన తరువాత సైలెంట్ అయిపోయిన రాజకీయ నేతలంతా తిరిగి యాక్టివ్ అవుతున్నారు. రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈసారి ఎన్నికల బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆంధ్ర ఆక్టోపస్ అనగానే మనకు గుర్తొచ్చేది లగడపాటి రాజగోపాల్. ఈయన కూడా ఏపీ, తెలంగాణ విడిపోయాక రాజకీయాలకు స్వస్తి చెప్పేశారు. ఇప్పుడు తిరిగి రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అంతా ఓకే కానీ.. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా? లేదంటే వేరే ఏ పార్టీలోనైనా చేరతారా? అసలు ఈయన ప్రస్తుతం ఎవరెరితో టచ్‌లో ఉన్నారు? రీ ఎంట్రీ విషయం తెలియగానే ఆయనను కలిసిన నేతలెవరు? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్‌లో లగడపాటితో కొందరు రహస్య సమాలోచనలు చేశారు. ఆ తర్వాత లగడపాటి రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నారన్న న్యూస్ బయటకు వచ్చింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సమావేశానంతరం లగడపాటి సైతం తన అనుచరులతో సమావేశమయ్యారట. ఇప్పటికే ఒకటి రెండు పార్టీల నేతలు ఆయనకు టచ్‌లో ఉన్నారని టాక్. గత ఎన్నికల సమయంలో లగడపాటి టీడీపీకి అనుకూలంగా సర్వేలు ఇచ్చారు. ఆ తరువాత ఏపీలో టీడీపీ తరుఫున పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది కానీ అదేమీ జరగలేదు. ఇప్పుడు కూడా టీడీపీ నేతతో లగడపాటి టచ్‌లోనే ఉన్నారట. మరోసారి లగడపాటి టీడీపీ నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే విజయవాడ అనేది కేశినేని నాని అడ్డా. ఆయనను కాదని లగడపాటికి టికెట్ కేటాయించడం అయితే జరగని పని అనే చెప్పాలి.
ఇక లగడపాటి బీజేపీలో చేరుతారంటూ కూడా ప్రచారం జోరుగానే సాగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో మంచి పొజిషన్‌లో ఉన్నారు. కిరణ్‌కు లగడపాటికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ క్రమంలోనే లగడపాటిని కిరణ్ స్వయంగా ఆహ్వానించారని టాక్ నడుస్తోంది. బీజేపీలో చేరితే విజయవాడ పార్లమెంట్ టికెట్ ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందట. కానీ టీడీపీతో పొత్తు ఉంటే పరిస్థితి మరోలా ఉంటుంది. సరే.. లగడపాటి ఏ పార్టీలో చేరుతారన్నది క్లారిటీ లేకున్నా కూడా రీ ఎంట్రీ మాత్రం పక్కా అని తెలుస్తోంది. ఆయన విజయవాడ నుంచి కాకుండా వేరొక చోటు నుంచి అయితే టీడీపీ టికెట్ పక్కాగా కేటాయిస్తుంది కానీ ఆయన వేరే చోటు నుంచి పోటీ చేయడం కష్టం. మొత్తానికి ఏపీ రాజకీయాలు మున్ముందు మరింత రసవత్తరంగా మారబోతున్నాయనడంలో సందేహం లేదు.