ఎన్నికలు వచ్చాయంటే హాట్ టాపిక్ అయ్యేవారిలో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒకరు. ప్రస్తుతం ఆయన తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు రాజకీయ వ్యూహాలను అందిస్తున్నారు. మరి ఆ పార్టీకి వ్యూహాలను అందిస్తున్నప్పుడు ఆయన వేరొక పార్టీకి డప్పు కొట్టరు కదా. తాజాగా పీకే ఇదే చేశారు. తాజాగా పీకే ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. బీఆర్ఎస్‌కు బీభత్సంగా డప్పు కొట్టారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కే సక్సెస్ రేటు ఎక్కువగా ఉందని.. కారు పార్టీ గెలిచేందుకు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కేసీఆర్‌కు తిరుగులేదన్నారు. మొత్తానికి పీకే వ్యాఖ్యలు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి.
ఒక పార్టీని ఇలా లేపడం కూడా తన రాజకీయ వ్యూహంలో ఒక భాగమే అయ్యుండవచ్చు. 2012 నుంచి ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. అప్పటి నుంచి తను చేపట్టిన ప్రాజెక్టులన్నీ దాదాపు సక్సెస్. కాబట్టి ఆయన ఏం మాట్లాడినా కూడా అది కరెక్ట్ అని జనం అనుకునే అవకాశం ఉంది. 2012లో గుజరాత్ సీఎంగా నరేంద్రమోదీ వరుస విజయాలు సాధించడం మొదలు.. 2014లో దేశ ప్రధానిగా మోదీ ఎన్నికవడం వరకూ ప్రశాంత్ కిశోర్ వ్యూహం ఉంది. అలాగే... బిహార్‌లో నితీశ్‌కుమార్ హ్యాట్రిక్ సీఎంగా గద్దెనెక్కడంలోనూ.. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డిలను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెట్టిన ఘనత కూడా ఆయనదే. ముఖ్యమంత్రులుగా గద్దెనెక్కేందుకు పీకే కారణమయ్యారు.
2012 నుంచి ఇప్పటివరకూ ఒకటి రెండు చోట్ల తప్ప.. అన్ని ఎన్నికల్లో పీకే చెప్పిన పార్టీలే విజయం సాధించడం విశేషం. ఈ సమయంలో తెలంగాణలో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ ఆశలు అడియాసలేనా? అన్న ప్రచారం జరుగుతోంది. ఒకటి రెండు చోట్ల పీకే ఫెయిల్ అయ్యారు కదా.. ఇక తెలంగాణ మూడవది కావచ్చేమోనని కొందరంటున్నారు. బీజేపీ ఎలాగూ రేసులో ఉన్నా లేనట్టే. ఇప్పుడు బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని పీకే చెప్పారు. నిజానికి కేసీఆర్ అపర చాణక్యుడు. ఆయనకు రాజకీయ వ్యూహకర్త అవసరం లేదు. అలాంటిది పీకేను నియమించుకున్నారంటే.. ఆయనకు కూడా ఏదో డౌట్ ఉండబట్టే కదా అని టాక్ నడుస్తోంది. ఇక చూడాలి ఏమవుతుందో..