తెలంగాణ సీఎం కేసీఆర్.. ఒకరకంగా చెప్పాలంటే.. తెలంగాణలోనే మోస్ట్ పవర్‌ఫుల్ లీడర్. అపర చాణక్యుడు. అలాంటిది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాస్త కష్టంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ధీటైన సవాల్ విసురుతోంది. కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు లేకపోలేదన్న టాక్ నడుస్తోంది. ఈ సమయంలో కేసీఆర్ ఏం చేస్తారు? కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు ఎలాంటి అస్త్రాన్ని బయటకు తీస్తారు? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో చాలా మంది నేతలను చేర్చుకుంటూ దూసుకెళ్లిపోతున్న కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ ఒకే ఒక పవర్‌ఫుల్ అస్త్రాన్ని ఎక్కుబెట్టబోతున్నారట. ఇంతకీ అదేంటి?
ఒకే ఒక అస్త్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ చెక్ పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో చంద్రబాబుపై విమర్శలతో తెలంగాణ సెంటిమెంట్ ను రగల్చడంలో సక్సెస్ అయిన కేసీఆర్.. ఈసారి మరోమారు అదే అస్త్రాన్ని బయటకు తీయబోతున్నారట. ఈ సారి షర్మిల, కేవీపీలను అడ్డుగా పెట్టుకుని కేసీఆర్ రాజకీయం నడిపించబోతున్నారట. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు షర్మిల చేరబోతోంది కాబట్టి ఆమెను అస్త్రంగా కేసీఆర్ వాడబోతున్నారట. వాటిని బలంగా సంధించి 2018 ఫలితాలను రిపీల్ చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్‌ను నడిపిస్తోంది తెలంగాణ సెంటిమెంటే. ఈసారి ఎన్నికల్లో కూడా ఈ సెంటిమెంటే కీలకం కాబోతోంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నంత కాలం ఆయన తెలంగాణకు అడుగడుగునా అడ్డు పడ్డారు. అసలు ఆయన ఉండి ఉంటే తెలంగాణ ఇప్పటికీ వచ్చి ఉండేది కాదని టాక్. అలాంటి రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల, ఆయన ఆప్త మిత్రుడు కేవీపీ ఆంధ్రాతో బంధాలను తెంచుకుని తెలంగాణకు వస్తామంటున్నారు. ఇప్పుడు దీనిని అస్త్రంగా చేసుకుని మరోమారు సెంటిమెంట్‌ను తెలంగాణ జనాల్లో వెలికి తీయనున్నారు కేసీఆర్. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో చేరనున్న షర్మిలకు వెన్నుదన్నుగా మారాలని కేవీపీ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. వీరిద్దరినీ లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ పావులు కదపబోతున్నారని సమాచారం. మొత్తానికి తెలంగాణలో రాజకీయం మున్ముందు రసవత్తరంగా మారబోతోంది.