తెలంగాణలో ఎన్నికల హీట్ రోజురోజుకూ పెరుగుతోంది. మూడు ప్రధాన పార్టీల మధ్య కీలకంగా ఈ పోరు జరగాల్సి ఉంది. అయితే ఈ పోటీలో బీజేపీ ఉన్నట్టా లేనట్టేనని ప్రస్తుత పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఇప్పుడు ప్రధాన పోరు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉండనుంది. కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ అయితే కనిపిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీల్లో ఉండి ఇబ్బందులు పడుతున్న నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఒకవైపు ఆపరేషన్ ఆకర్ష్, మరోవైపు టికెట్ల కేటాయింపు.. ఆపై ఎన్నికల ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ బిజీబిజీగా ఉంది.
తెలంగాణలో హాట్ టాపిక్ అంటే నల్గొండ జిల్లా. కోమటిరెడ్డి కుటుంబం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటే.. తమ్ముడు బీజేపీలో కొనసాగుతున్నారు. కొంత కాలం క్రితం బీజేపీలోకి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి.. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన బీజేపీలో పెద్దగా యాక్టివ్‌గా అయితే లేరు. ఇక తెలంగాణలో బీజేపీ వెనుకబడి పోవడం.. కాంగ్రెస్ పార్టీ ఓ రేంజ్‌లో పుంజుకోవడం వంటి పరిణామాలతో రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశముందని ప్రచారం అయితే జోరుగానే జరుగుతోంది.
రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలోనూ ఎలాంటి కార్యక్రమానికి ఆయన హాజరుకావడం లేదని తెలుస్తోంది. ఇదంతా తెలంగాణలో బీజేపీకి ఆదరణ లేని కారణంగానే రాజగోపాల్ రెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఏక కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ బలపడటం, బీజేపీ వీక్ అవడం జరుగుతోంది. దీంతో కమలం పార్టీలో చేరి తప్పు చేశాననే ఫీలింగ్‌తో రాజగోపాల్ రెడ్డి ఉన్నారని టాక్ నడుస్తోంది. ఇంత ప్రచారం జరుగుతున్నా కూడా కనీసం రాజగోపాల్ రెడ్డి నుంచి ఎలాంటి రియాక్షన్ రావడం లేదు. తన అభిప్రాయం ఏంటనేది కూడా బయటకు రానివ్వడం లేదు. టికెట్ కేటాయింపు కార్యక్రమం కూడా కాంగ్రెస్‌లో పూర్తవుతోంది. మరి ఇప్పటికైనా రాజగోపాల్ రెడ్డి ఆ గట్టునే ఉండిపోతారా? ఈ గట్టుకు వస్తారా? అనేది చూడాలి.