కర్ణాటక ఎన్నికల్లో మంచి సక్సెస్ సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఎన్నికల శంఖారావానికి తెలంగాణ విలీన దినోత్సవమైన సెప్టెంబరు 17న ముహూర్తం ఫిక్స్ చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టికెట్లను ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ ఆ లిస్ట్ ను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే నిన్న స్క్రీనింగ్ కమిటీ హైదరాబాద్‌కు చేరుకుంది. ఇప్పటికే సిట్టింగులు, మాజీలు, సీనియర్ల క్రైటీరియాతో దాదాపు 25 నుంచి 30 సీట్లు ఇప్పటికే ఫైనల్ అయిపోయాయి. ప్రస్తుతం మిగతా సెగ్మెంట్లలో అభ్యర్థుల ఎంపికపై ఇప్పుడు కసరత్తు జరుగుతోంది.
కొడంగల్ రేవంత్ రెడ్డి, మధిర భట్టి విక్రమార్క, హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ములుగు సీతక్క, సంగారెడ్డి జగ్గారెడ్డి, ఆందోల్ దామోదర రాజనర్సింహ, జగిత్యాల జీవన్ రెడ్డి, మంథని శ్రీధర్ బాబు , నాగార్జునసాగర్ జానారెడ్డి కుమారుడు, భద్రాచలం పోదెం వీరయ్య, మంచిర్యాల ప్రేమ సాగర్ రావు, పరిగి రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మల్ రెడ్డి రంగారెడ్డి , కోదాడ పద్మావతి రెడ్డి, వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్, మక్తల్ ఎర్ర శేఖర్, జహీరాబాద్ ఏ చంద్రశేఖర్, బోధన్ సుదర్శన్ రెడ్డి, నాంపల్లి ఫిరోజ్ ఖాన్, భూపాలపల్లి గండ్ర సత్యనారాయణ, వరంగల్ ఈస్ట్ కొండ సురేఖ, చొప్పదండి మేడిపల్లి సత్యం, నర్సంపేట దొంతి మాధవరెడ్డి, హుజూరాబాద్ బల్మురు వెంకట్, వేములవాడ ఆది శ్రీనివాస్, జడ్చర్ల అనిరుథ్ రెడ్డి , నిర్మల్ కూచాడి శ్రీహరిరావు పేర్లు ఖాయమైనట్లు సమాచారం.
ఇక సెప్టెంబర్ 17న అగ్ర నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులతో తెలంగాణలో భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. ఈ బహిరంగ సభలో తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను సోనియా గాంధీ ప్రకటించనున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీయే టార్గెట్‌గా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగనుంది. ఈ క్రమంలోనే సోనియా బీఆర్ఎస్ ప్రభుత్వంపై చార్జిషీట్‌ను విడుదల చేయనున్నారని సమాచారం. ఈ చార్జిషీట్‌ను హైలైట్ చేస్తూ.. క్షేత్రస్థాయి ప్రచారానికి టీ కాంగ్రెస్ వెళ్లనుంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. కీలక నేతలందరికీ ఒక్కొక్కరికీ ఒక్కో నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయించనుంది. ఆయా నేతలంతా 17 రాత్రికి తమకు కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లి రాత్రి అక్కడే బస చేసి.. 18 నుంచి ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిగా ఎన్నికల బరిలోకి దిగనుంది. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా ఒకేసారి అన్ని నియోజకవర్గాల్లోనూ ఒకేసారి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. దీంతో పొలిటికల్ హీట్ తెలంగాణలో బీభత్సంగా పెరిగే అవకాశం ఉంది.