తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున రాజకీయ దుమారాన్నే రేపుతున్నాయి. అయినా సరే.. తాను చేసిన కామెంట్స్‌కు కట్టుబడి ఉంటానంటూ ఉదయనిధి తెలిపారు. గట్స్ అంటే అలా ఉండాలి మరి. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలంతా అగ్గి మీద గుగ్గిల మవుతున్నారు. పెద్ద ఎత్తున ఆయనపై విమర్శలు చేస్తు్న్నారు. ఉదయనిధిని కార్నర్ చేసి ఒక ఆట ఆడుకుంటున్నారు. అయినా సరే తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ ఆయన వివరించారు. సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేయడం చాలా మందికి నచ్చలేదు.
కొందరు మాత్రం ఉదయనిధి చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు. కానీ ఆయన చేసిన కామెంట్లతో రాజకీయ రగడ మొదలైంది. ‘‘సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగీ లాంటిదని.. దాన్ని నిర్మూలించాలి’’ అంటూ పెద్ద ఎత్తున రాజకీయ దుమారాన్ని రేపారు. దీనిపై విమర్శలు రావడంతో తన మాటలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను సనాతన ధర్మాన్ని అనుసరించే వారిని నిర్మూలించాలని తాను అన్నట్టుగా కొంతమంది తప్పుడు ప్రచారం చేశారని కానీ తనలా అనలేదన్నారు. సనాతన ధర్మాన్ని విశ్వసించే వారి గురించి తానసలు మాట్లాడలేదన్నారు. సనాతన ధర్మాన్ని మాత్రమే నిర్మూలించాలని అన్నానని ఉదయనిధి వెల్లడించారు.
సనాతన ధర్మం అనేది కులం, మతం పేరుతో ప్రజలను విడదీసే సిద్ధాంతమని తాను గట్టిగా నమ్ముతున్నానని... తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని తాజాగా ఉదయనిధి స్టాలిన్ వివరణ ఇచ్చారు. మొత్తానికి ఉదయనిధికి అనుకూలంగా కన్నా వ్యతిరేకంగా ఓ పెద్ద వర్గమే రంగంలోకి దిగింది. అయితే తన వాదనలపై తాను అటు న్యాయస్థానం.. ఇటు ప్రజా న్యాయస్థానంలో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. దీంతో రగిలిపోయిన కొందరు ఆయనపై కేసులు వేసేందుకు సైతం సిద్ధమయ్యారు. ఇక ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించారు. రామజన్మభూమి చీఫ్ మహంత్ ఆచార్య సత్యేంద్ర దాస్ సహా బీజేపీ కీలక నేతలంతా రంగంలోకి దిగి ఉదయనిధిపై పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తున్నా కూడా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానంటూ ఆయన కూల్‌గా తెలిపారు.