గుడివాడలో కొడాలి నానికి ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చెక్ పెడుతున్నారా? ఆయనను సైడ్ చేసి సీన్‌లోకి వల్లభనేని బాలశౌరిని తీసుకొస్తున్నారా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా వల్లభనేని బాలశౌరిని జగన్ ప్రోత్సహిస్తున్నారన్న అనుమానం వైసీపీ వర్గీయుల్లో ఉంది. కొడాలి నాని విషయంలో జగన్ రెడ్డి మరో ఆలోచనతో ఉన్నారని అంటున్నారు. ఆయనను ఈ సారి లోక్ సభకు పోటీ చేయించేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని అందుకు.. బాలశౌరిని గుడివాడకు పంపుతున్నారని భావిస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారంలో గుడివాడలో తన ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు జగన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను చూస్తూ ఉండటం తప్ప కొడాలి నాని ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందట.
ఎందుకోగానీ వైసీపీ అధినేత జగన్ గుడివాడలో కొడాలి నానికి వ్యతిరేకంగా మరో నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. నిజానికి గుడివాడ.. కొడాలి నాని అడ్డా. అక్కడ ఏం జరగాలన్నా కొడాలి నాని పర్మిషన్ ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే.. జగన్‌కు పులివెందుల ఎలాగో.. కొడాలి నానికి గుడివాడ అలా. అలాంటి గుడివాడలో కొడాలి నాని లేకుండా కొత్త పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. నిజానికి ఇది ఊహించడమే కష్టం. కానీ జరిగింది. దీనిపై కొడాలి నాని అనుచరులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. విషయం కాస్తా బయటకు పొక్కడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా గుడివాడ హాట్ టాపిక్ అయిపోయింది.
ఎంపీ బాలశౌరి ముఖ్య అతిథిగా శనివారం కొత్త మున్సిపల్ కార్యాలయంలో నూతన పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి కనీసం కొడాలి నానికి సమాచారం కూడా లేకపోవడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న కొడాలి నాని అనుచరులు కొత్త మునిసిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని బాలశౌరి అనుచరులతో ఘర్షణకు దిగారు. తదుపరి పరిణామాలు ఎలా ఉన్నా కానీ.. వల్లభనేని బాలశౌరిని జగన్ ప్రోత్సహిస్తున్నారనేది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై వైసీపీ వర్గీయుల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే మరో హాట్ టాపిక్ ఏంటంటే.. ఈసారి కొడాలి నానిని లోక్‌సభ బరిలో జగన్ దింపుతారట. అందుకే బాలశౌరిని గుడివాడలో హైలైట్ చేస్తున్నారట. ఇంత జరుగుతున్న కొడాలి నానికి చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి అని స్థానికులు చెప్పుకుంటున్నారు.