దివంగత వంగవీటి రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ నిశ్చితార్థం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో నిడారంబరంగా జరిగింది. మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ జక్కం అమ్మానీ, బాబ్జీ దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లితో రాధా నిశ్చితార్థ వేడుక జరిగింది. నిశ్చితార్థం అయిన వెంటనే వివాహం ముహూర్తాన్ని కూడా నిర్ణయించారు. అక్టోబర్ 22 రాత్రి 7.59 గంటలకు పెళ్లికి శుభ ముహూర్తాన్ని పండితులు ఫిక్స్ చేశారు. అయితే ఈ నిశ్చితార్థ వేడుకకు అతి కొద్ది మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. అయితే గతంలో టీడీపీలో కొనసాగిన జక్కం ఫ్యామిలీ కొంత కాలం క్రితం జనసేనలో చేరింది.
అయితే వంగవీటి రాధ నిశ్చితార్థ వేడుకలో టీడీపీ మినహా వైసీపీ, జనసేన నేతలు హడావుడి చేయడం హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి టీడీపీ నుంచి ఈ వివాహ వేడుకకు స్థానిక టీడీపీ నేత, నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు తప్ప ఒక్క కీలకనేత కూడా ఎంగేజ్‌మెంట్‌కు రాకపోవడం గమనార్హం. జనసేన నుంచి మాత్రం బొమ్మిడి నాయకర్, కొటికలపూడి చినబాబు హాజరయ్యారు. వైసీపీ నుంచి స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు హాజరయ్యారు. అలాగే గతంలో టీడీపీ, వైసీపీల్లో పని చేసిన సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా హాజరయ్యారు. ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే.. టీడీపీ నేతలు ఎందుకు హాజరు కాలేదు?
వైసీపీ, జనసేన నుంచి నేతలు వచ్చారు కానీ టీడీపీ నుంచి రాలేదంటూ ప్రచారం జరుగుతోంది. పోనీ.. వైసీపీ, జనసేన నుంచి కీలక నేతలు ఎవరు వచ్చారు? వైసీపీ నుంచి స్థానిక ఎమ్మెల్యే తప్ప పెద్దగా కీలక నేతలెవరూ హాజరు కాలేదు. అటు జనసేన నుంచి కూడా అంతే. దీనిని బట్టి చూస్తే ఈ నిశ్చితార్థ వేడుకకు స్థానిక నేతలు మినహా పై స్థాయి వారెవరినీ ఆహ్వానించింది లేదు. ఇటీవల కాలంలో రాధ జనసేనలోకి వెళతారంటూ ప్రచారం జరిగింది. కానీ రాధ మాత్రం నారా లోకేష్ యువగళం పాదయాత్రకు హాజరై ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇక ఇప్పుడు టీడీపీ నేతలు ఎందుకు రాలేదంటూ కొత్త ప్రచారం. ఆయనేదో సింపుల్‌గా చేసుకుందామని స్థానిక నాయకత్వాన్ని వరకూ పిలుచుకుంటే.. దీనికి కూడా లేని కారణాలను సృష్టించి మరీ రచ్చ చేస్తున్నారు.