ఈ మధ్య క్రికెటర్స్ కూడా సినిమాలపై దృష్టి పెట్టారు. హర్భజన్ సింగ్ ఏకంగా నటిస్తే.. ధోని ఓ బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారారు. ఇర్ఫాన్ పఠాన్ కూడా ఆ మధ్య ఓ సినిమాలో నటించారు. ఇలా క్రికెట్ తర్వాత సినిమానే అనేలా.. భావిస్తున్నారు క్రికెటర్స్. ఇప్పుడో క్రికెటర్ బయోపిక్ కోసం.. ఏకంగా క్రికెట్ గాడ్‌నే తీసుకొస్తున్నారు మేకర్స్. వివరాల్లోకి వెళితే.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్. ఆయన జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం 800. ఈ మూవీ ట్రైలర్‌ను సెప్టెంబర్ 5న ముంబైలో విడుదల చేయబోతున్నారు. ఈ వేడుకకు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీలో మురళీధరన్ పాత్రలో స్లమ్‌డాగ్ మిలియనీర్ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించగా.. మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఎంఎస్ శ్రీపతి ఈ స్క్రిప్ట్‌ని రెడీ చేశారు. ఇప్పటికే భారీ అంచనాలున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను కూడా అంతే భారీగా నిర్వహిస్తున్నారు. ముంబైలో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని భారీగా నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది.
సచిన్, మురళీధరన్ స్నేహం విషయానికి వస్తే.. ఇండియా తరఫున సచిన్, శ్రీలంక తరఫున మురళీధరన్ ఎన్నో మ్యాచ్‌లు ఆడారు. మైదానంలో పోటీ పడినప్పటికీ... మైదానం వెలుపల ఇద్దరు మధ్య మంచి స్నేహం ఉంది. అందుకే మురళీధరన్ కోసం 800 ట్రైలర్ విడుదల చేయడానికి సచిన్ వస్తున్నారు. ఈ సినిమా ఆలిండియా పంపిణీ హక్కులను శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.