ఈసారి బీజేపీతో అమీతుమీ తేల్చుకునేందుకు కాంగ్రెస్ సహా ప్రాంతీయ పార్టీలన్నీ సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఈ పార్టీలన్నీ జట్టు కట్టి.. ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పుడు ఈ కూటమి ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా శరవేగంగా పావులు కదుపుతోంది. ఈ కూటమిలో మొత్తం 28 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పార్టీల మధ్య సీట్ల సర్దుబాబు అంశం ఓ కొలిక్కి వస్తోంది. దీంతో దేశంలో పొలిటికల్ హీట్ బీభత్సంగా పెరిగిపోయింది. సర్వేలు అన్నీ ప్రధాని మోదీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వస్తున్నా కూడా అసలు సీన్ మరోలా ఉందని టాక్. ఇప్పుడు వస్తున్న సర్వేలన్నీ పెయిడ్ అని ప్రచారం జరుగుతోంది.
నిజానికి ఇండియా కూటమిలో ప్రస్తుతం ఉన్న 28 పార్టీలకూ తమ సొంత రాష్ట్రాల్లో ఎన్నో కొన్ని అసెంబ్లీ సీట్లు అయితే పక్కాగా ఉన్నాయి. అంతేకాదు.. ఈ పార్టీలు తమ రాష్ట్రంలో బీభత్సమైన ఓటు బ్యాంకును కలిగి ఉన్నాయి. ఇది వాస్తవానికి ఎన్డీయే కూటమికి పెద్ద మైనస్. కారణం ఏంటంటే.. ఈ కూటమిలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా లేని పార్టీలు చాలానే ఉన్నాయి. ‘ఇండియా’ కూటమిలో ఐకమత్యం ఉండదు కాబట్టి ఏ పార్టీ కూడా ఆ కూటమిలో చేరే అవకాశమే లేదని భావించిన ఎన్డీఏకి ఏకంగా 28 పార్టీలు కూటమిలో చేరడం గట్టి షాకే. పైగా వీళ్లంతా ఒక్క చోట చేరి కొట్టుకోవడం మినహా సాధించేదేమి లేదనుకున్న ఎన్డీఏకి ఈ కూటమి శుక్రవారం ముంబైలో సమావేశమై సీట్ల సర్దుబాబుపై ఏకాభిప్రాయాన్ని సాధించి షాకిచ్చింది.
మొత్తానికి ఇండియా కూటమి దేశంలో సంచలనంగా మారనుందనే సంకేతాలు అయితే ఎన్డీఏకి అందుతున్నాయని టాక్. 14 మంది నేతలతో సమన్వయ కమిటీని ప్రకటించడం అనేది కూటమిని నిర్మాణాత్మకంగా బలోపేతం చేసే దిశగా పడిన పెద్ద ముందడుగు. ఇక ఎన్డీఏ విషయానికి వస్తే.. కింగ్ మేకర్ వచ్చేసి బీజేపీ.. చరిష్మా కలిగిన లీడర్ వచ్చి మోదీ. ఇద్దరూ ఒక పార్టీకి చెందినవారే. ఈ ఎన్టీఏ కూటమిలోని అన్ని పార్టీలు కలిపి సాధించిన సీట్లు 50 లోపే. మరోవైపు ఇండియా కూటమి ఫుల్ స్ట్రాంగ్ అవుతుంది. అందుకే ఇంకా సమయం ఈ కూటమికి ఇవ్వకూడదని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లును పార్లమెంటులో పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ఏం జరిగినా నిలబడేందుకు ఇండియా కూటమి సైతం సన్నద్ధమవుతోంది. దక్షిణాదిలో అయితే ఇండియా కూటమికి తిరుగు లేదు. చూసుకోవాల్సింది ఉత్తరాదిలోనే. ఒక్కసారి ఉత్తరాదిపై పట్టు సాధించిందా.. ఎన్డీఏ కూటమికి చుక్కలే.