వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదంతో కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న జమిలి ఎన్నికల వ్యవహారం ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి ‘ఒక దేశం.. ఒకేసారి ఎన్నికలు’ అనే విధానం కొత్తదేమీ కాదు.. గతంలో అంటే 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇది మన దేశంలో అమలు జరిగింది. 1952, 1957, 1962, 1967 సంవత్సరాలలో ఈ విధమైన ఎన్నికలు జరిగాయి. దేశ ప్రజలు ఏకకాలంలో ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకొన్నారు. ఆ తరువాత అంటే 1968-69లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు పలు కారణాలతో రద్దయ్యాయి. దీంతో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇక ఆ తరువాత పలు మార్లు ఈ విధానాన్ని ప్రభుత్వాలు అమల్లోకి తీసుకురావాలన్నా జరగలేదు. ఇప్పుడు ఇదంతా పక్కనబెడితే జమిలి ఎన్నికలు ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అనేది ఆసక్తికరంగా మారింది.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదన తిరిగి తెరపైకి వచ్చింది. దీనిపై 2019లో ఆల్ పార్టీ మీటింగ్‌ను కూడా ప్రధాని మోదీ ఏర్పాటు చేశారు. అయితే మొత్తం ఈ సమావేశానికి 40 పార్టీలను ఆహ్వానిస్తే.. 21 మాత్రమే హాజరయ్యాయి. ఇక వాటిలో కూడా కొన్ని పార్టీలు మాత్రమే జమిలి ఎన్నికలకు స్వాగతం పలికాయి. నిజానికి ఈ ప్రతిపాదన ప్రాంతీయ పార్టీలకు నష్టం చేకూరుస్తుందని చర్చ జరుగుతోంది. అంతేకాకుండా జమిలీ ఎలక్షన్లకు సై అంటే ఉన్నపళంగా ఇంకా సమయం ఉన్నా కూడా రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆయా రాష్ట్రాలు అంగీకరించేందుకు సిద్ధంగా లేవు.
జమిలి ఎన్నికల కారణంగా ప్రజాధనం వృధా కాదని మోదీ ప్రభుత్వం చెబుతోంది. ఇదైతే నిజమే. దేశవ్యాప్తంగా 10 లక్షల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ప్రతి కేంద్రానికి 2సెట్ల ఈవీఎంలు సరిపోతాయి. పైగా భద్రతా సిబ్బందిని ఒకసారి మోహరిస్తే సరిపోతుంది. లేదంటే కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్‌లు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు మొత్తంగా తడిచి మోపెడవుతుంది ఖర్చు. కానీ దీనికంటే ప్రచార ఖర్చు తగ్గించుకుంటే బెటర్ కదా? ఈ దిశగా ఏ ప్రభుత్వమూ ఆలోచన చేయదు. ఇక దీని వలన చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలు బీభత్సంగా నష్టపోతాయని టాక్. ఒకేసారి ఎన్నికలు జరిగితే బీజేపీ వంటి పెద్ద పార్టీలకు బాగా లాభం చేకూరుతుందనడంలో సందేహం లేదు. నిజానికి ఎన్నికల ఖర్చు ఆదా కోసం ఏ పార్టీ చూడదు. ఆ రోజులు ఎప్పుడో పోయాయి. జమిలితో మనకెంత లాభం చేకూరుతుందన్నదే పాయింట్. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఇదే చేస్తోందని ప్రచారం జరుగుతోంది.