జగనన్న వదిలిన బాణం అన్నకే ఎదురెళుతుంటే.. తమ్ముళ్ల గుండెలు చివుక్కుమంటున్నాయి. నా అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలనే.., దేశంలో ఎక్కడా లేని స్కీములు అమలు చేస్తున్నానని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెబుతుంటే.. ఆ అక్కచెల్లెమ్మల జాబితాలో తోడబుట్టిన చెల్లెలు షర్మిల లేకపోవడం వైఎస్ అభిమానులను కలచి వేస్తోంది. జగన్ జైలు పాలైన తరుణంలో పార్టీకి వెన్నెముకలా మారిన షర్మిలను జగన్ తురుపుముక్కలా తీసివేస్తుంటే అక్కడి ప్రజలు కూడా బాధపడుతున్నారు. కనీసం తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతి కార్యక్రమాలైనా ఆ అన్నాచెల్లెళ్లను కలుపుతాయేమోనని చూసిన అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. నేడు వైఎస్సార్ వర్ధంతి. నిన్ననే షర్మిళ ఇడుపులపాయకు చేరుకున్నారు. నేటి ఉదయం ఆమె ప్రార్థనలు ముగించుకుని హైదరాబాద్ వెళ్లిపోయిన అనంతరం ఇడుపుల పాయకు వచ్చేలా జగన్ షెడ్యూల్ సిద్ధం చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది?
జగన్, షర్మిల మధ్య ఏం జరిగిందనేది పూర్తిగా బయట ప్రపంచానికి అయితే ఎవరికీ తెలియదు. అక్కాచెల్లెమ్మల తల నిమురుతూ ఎక్కడ లేని ప్రేమ కురిపించే జగన్‌కు.. రకరకరాల స్కీముల పేరుతో ప్రభుత్వ సొమ్మును పంచిపెడుతున్న జగన్‌కు సొంత చెల్లికి కుటుంబ ఆస్తిని పంచడానికి మనసు రాలేదట. ఆస్తుల పంపకాల విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయట. తల్లి విజయమ్మ మాత్రం తన కూతురికే సపోర్ట్‌గా నిలిచారు. ప్రారంభంలో అన్నకు ఎదురెళ్లేందుకు షర్మిళ మనసు అంగీకరించలేదన్నది బహిరంగ రహస్యమే. అందుకే ఏపీలో కాకుండా తెలంగాణలో రాజకీయ పార్టీని పెట్టారు. కానీ అన్న తనను కొడుతున్న ఒక్కో దెబ్బకు ఆమెకు మనసు విరిగిపోయినట్టుంది. ఇక తాడో పేడో తేల్చుకునే స్థితికి అయితే వచ్చేశారు.
యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్న షర్మిళ..
సోదరుడి నుంచి షర్మిళకు వేధింపులు పెరిగిన కారణంగానే ఆమె ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరుఫున ప్రచారం నిర్వహించి అన్నకు ఎదురెళ్లేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నట్టు టాక్. ఏపీలో మైనింగ్ వ్యాపారాలను దెబ్బతీసి షర్మిళను జగన్ చావు దెబ్బ కొట్టారు. అంతటితో ఆగారా? తెలంగాణలో కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించకుండా జగన్ అడ్డుపడ్డారట. అలాగే ఏపీ ప్రభుత్వం గతంలో షర్మిళకు ఇద్దరు గన్‌మెన్‌ను కేటాయించింది. ఆ తరువాత జగన్ ప్రోద్బలంతో ఆమెకు కేటాయించిన సెక్యూరిటీని సైతం ఉపసంహరించుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో షర్మిళ సహనం నశించింది. కాంగ్రెస్ ప్రతిపానను ఆమోదించినట్టు తెలుస్తోంది. మొత్తానికి జగన్ చేసిన అన్యాయాలతో మనసు విరిగిన షర్మిళ ఎప్పటికీ ఆయనను కలవరనే తెలుస్తోంది.