షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేందుకు శరవేగంగా అడుగులు ముందుకు వేస్తుంటే టీపీసీసీలో టెన్షన్ మొదలైందా? ఒక వర్గం షర్మిలకు సాదర ఆహ్వానం పలుకుతుంటే మరో వర్గం మాత్రం వ్యతిరేకిస్తోందా? ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది అనుకుంటున్న కాంగ్రెస్‌లో మళ్లీ షర్మిల అంశంతో వర్గవిభేదాలు రాజుకుంటున్నాయా? అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? షర్మిలను ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఎవరు స్వాగతం పలుకున్నారు? వంటి అంశాలపై ప్రత్యేక కథనం. షర్మిలను టీపీసీసీలోకి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆహ్వానిస్తున్నారట. కానీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం వ్యతిరేకిస్తున్నారని సమాచారం.
షర్మిల ఎప్పటి నుంచో పాలేరు స్థానాన్ని ఆశిస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా దీనిలో మార్పేమీ ఉండకపోవచ్చు. అయితే పాలేరు నుంచి షర్మిలను బరిలోకి దింపడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. షర్మిల.. కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవడం.. ఆమె పార్టీని విలీనం చేస్తారంటూ వార్తలు వస్తున్నప్పటి నుంచి కూడా రేవంత్ షర్మిలకు పాలేరు స్థానాన్ని కేటాయించే అంశంలో విభేదిస్తూనే ఉన్నారని సమాచారం. తాజాగా.. షర్మిల ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్‌ను కలిసిన నేపథ్యంలో ఈ ఇష్యూ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి పాలేరు నుంచి ఆమెను పోటీకి దింపాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు సమాచారం.
రేవంత్ రెడ్డి వ్యతిరేకించడానికి కారణం లేకపోలేదు. గత ఎన్నికల్లో కూటమిగా ఏర్పడ్డ ప్రతిపక్షాలు చంద్రబాబును కూడా తమతో కలుపుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి అదే పెద్ద మైనస్ అయ్యింది. టీడీపీ ఎంట్రీతో కేసీఆర్ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. మళ్లీ ఆంధ్రా పాలన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూపెద్ద ఎత్తున ప్రచారం చేసి మొత్తానికి కాంగ్రెస్ పార్టీని దారుణాతి దారుణంగా ఓడించారు. ఇప్పుడు కాంగ్రెస్‌లోకి షర్మిలను తీసుకుంటే మళ్లీ అదే రిపీట్ అవుతుందని రేవంత్ వాదిస్తున్నట్టు సమాచారం. అయితే రాజశేఖర్ రెడ్డితో కలిసి మెలిసి ఉన్న కారణంగా కోమటిరెడ్డి వర్గం మాత్రం షర్మిలను ఆహ్వానిస్తోంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డ కారణంగా నాలుగు ఓట్లు వచ్చినా అది కాంగ్రెస్ పార్టీకి మంచిదే అంటూ రీసెంట్‌గా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఇక తుమ్మల పార్టీలో చేరబోతున్నారు కాబట్టి పాలేరును ఆయనకు కేటాయించాల్సిందేనని రేవంత్ అంటున్నారట. మొత్తానికి షర్మిల అంశం కాంగ్రెస్ పార్టీలో పెను దుమారాన్నే రేపేలా ఉంది.