తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. కొన్ని నెలల క్రితం తెలంగాణలో ఎక్కడో అట్టడుగున ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనూహ్యంగా పుంజుకుంటోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ ఇచ్చాయి. ఇక అక్కడ నుంచి మొదలు.. పార్టీతో అటు ఇటుగా ఉన్న నేతలంతా ఒక్కతాటిపైకి రావడం.. పార్టీ మారదామనుకున్న నేతలు డ్రాప్ అవడం.. పక్క పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంపింగ్స్ వంటివి చకచకా జరిగిపోతున్నాయి. ఇక ఇటీవలి కాలంలో కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలోకి రావడమనేది అధికార బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడని పరిణామం. అటు బీజేపీ అడ్డు తొలిగిపోయిందిలే అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఏకు మేకే కూర్చుంటోంది.
ఖమ్మం జిల్లా నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీని అంతమొందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక వెంటనే బీఆర్ఎస్ పార్టీ పక్కాగా ప్లాన్ చేసి ఆయన అనుచరుడిని తమ పార్టీలోకి లాగేసి హ్యాపీ ఫీలయ్యేలోగా.. ఊహించని దెబ్బ. బీఆర్ఎస్ నుంచి పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల నాగేశ్వరరావు... కారు దిగి హస్తం గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన నుంచి దీనికి సంబంధించిన సంకేతాలు కూడా వెలువడటంతో బీఆర్ఎస్ అధిష్టానం షాక్ అయ్యింది. తాజాగా తుమ్మలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లు రవి, ఇతర నేతలు భేటీ అయి.. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. తుమ్మల కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే తుమ్మల హస్తానికి జై కొట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.
ఇక ఖమ్మం జిల్లాలో అయితే బీఆర్ఎస్ పార్టీకి మునపటి రోజులే వచ్చేలా ఉన్నాయి. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా నుంచి ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకున్నది లేదు. 2018 నాటికి కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పేమీ లేదు. ఇప్పుడు కూడా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తుమ్మల కాంగ్రెస్‌లో చేరితే మాత్రం బీఆర్ఎస్‌కు గడ్డు పరిస్థితులు ఖాయం. అయితే తుమ్మల పరిణామంతో సీఎం కేసీఆర్ కూడా అప్రమత్తమయ్యారు. వెంటనే ఖమ్మం జిల్లాకు చెందిన పార్టీ నేతలను హైదరాబాద్‌కు పిలిపించుకుని తుమ్మల వ్యవహారాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌టీపీ కూడా విలీనమైతే ఆ పార్టీ మరింత బలం పుంజుకుంటుంది. త్వరలోనే ఈ విలీన ప్రక్రియ కూడా పూర్తి కానుంది. ఒకవైపు తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరితే.. పాలేరు నుంచి పోటీకి దిగడం పక్కా.. మరోవైపు షర్మిల కూడా పాలేరు స్థానాన్ని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్ముందు పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయి.