2019 ఎన్నికల సమయంలో ఓ రేంజ్‌లో ఎగిసిన కెరటం గోరంట్ల మాధవ్. జేసీ దివాకర్ రెడ్డితో తాడిపత్రిలో ఒక ఆశ్రమం గొడవల్లో ఢీ అంటే ఢీ అని ఎదురు నిలిచి మీడియా సమావేశం పెట్టి మరీ మీసం మెలేసి తొడకొట్టారు. నిజానికి జేసీ బ్రదర్స్‌కు ఏ అధికారి అయినా సలాం కొట్టాల్సిందే. అలాంటిది.. పోలీస్ అధికారిగా ఉన్న గోరంట్ల అలా ఎదురు నిలవడం అనంతపురం జిల్లాలోనే హాట్ టాపిక్‌గా మారింది. అంతే ఆ దెబ్బకు ఆయన ఫేట్ మారిపోయింది. ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది. ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల బాట పట్టారు. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి.. గోరంట్ల మాధవ్‌కు ఎంపీ టికెట్ ఇచ్చారు.
అప్పట్లో ఫ్యాన్ గాలి బాగా వీయడంతో పాటు గోరంట్లకు వచ్చిన ఇమేజ్‌తో ఎంపీగా సునాయసంగా విజయం సాధించారు. సీన్ కట్ చేస్తే.. ఓ రేంజ్‌లో ఎగిసిన కెరటం నేల చేరడానికి ఎంతో సమయం పట్టలేదు. నాలుగేళ్లు తిరిగేసరికి ఆకాశాన్ని చూసిన కళ్లు నేల చూడటం మొదలు పెట్టాయి. ఇప్పుడు గోరంట్ల మాధవ్‌ను అక్కడి ప్రజానీకం కనీసం చూసే పరిస్థితి లేదు. ఆయన గురించి ఎప్పుడో మరిచిపోయారు. ఆయన కూడా అసలు జనాల్లోకి వెళ్లడమే మానేశారు. ఎంపీగా గెలవడంతో గోరంట్ల మాధవ్‌కు ఎక్కడలేని వివాదాలూ చుట్టుముట్టాయి. ఇవి చాలవన్నట్టు ఓ మహిళతో న్యూడ్ కాల్ మాట్లాడి అడ్డంగా బుక్ అయిపోయారు.
దెబ్బకు మాధవ్ పొలిటికల్ కెరీర్‌కు కావల్సినంత డ్యామేజ్ జరిగిపోయింది. ఆ తర్వాత వీడియో కాల్ ఫేక్ అని సమర్థించుకునే యత్నం చేశారు. పైగా సదరు మహిళ కూడా వీడియోలో ఉన్నది తాను కాదని చెబుతూ టీడీపీ నేతలపై కదిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయినా కూడా ఎంపీకి కోలుకోలేని దెబ్బ అయితే తగిలింది. ఈ వ్యవహారం అంతా జరిగిన రోజుల్లో అయితే వచ్చే ఎన్నికల్లో మాధవ్‌కు జగన్ టికెట్ కేటాయిస్తారా? లేదా? అనేది కూడా సందేహంగానే ఉంది. ఒకవేళ కేటాయించినా కూడా గెలవడం కష్టమని ప్రచారం జరిగింది. కొంతకాలంగా అసలు గోరంట్ల టాపిక్కే లేదు. అసలు గోరంట్ల మాధవ్ అనే నేత ఉన్నాడనే విషయాన్ని కూడా అక్కడి ప్రజలు మరచిపోయారనడంలో సందేహమే లేదు.