దేశమంతా ఒక లెక్క.. ఏపీ ఒక లెక్క అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఏపీలో పొత్తులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పొత్తులపై ఇప్పుడే ఎందుకు డిస్కషన్? అని టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా చెప్పినా సరే ఇది హాట్ టాపిక్ అవుతూనే ఉంది. చంద్రబాబు హస్తినకు ఏ పని మీద వెళ్లినా కూడా దానికి పొత్తుల అంశాన్ని జోడించేస్తున్నారు. అయితే బీజేపీతో ఏమో కానీ.. జనసేనతో పొత్తు టీడీపీకి లాభిస్తుందని అందరికీ తెలిసిందే. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ పొత్తు పెట్టుకోకపోవడం వల్లే రెండిటికీ నష్టం వాటిల్లింది. కలిసి ఉంటే విజయం సాధించకున్నా కూడా వైసీపీకి మాత్రం 151 సీట్లు వచ్చి ఉండేవి కాదు.
ఎన్నికల నాటికి జనసేన-బీజేపీ టీమ్‌తో కలిసే విషయంలో టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఏపీలో అధికారాన్ని దక్కించుకోవాలంటే ముఖ్యంగా రాయలసీమ మనసు గెలుచుకోవాలి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే.. ఇక్కడ ఫలితాలు ఎవరికీ పూర్తి స్థాయిలో అనుకూలంగా రావు. ఒకవేళ టీడీపీ, జనసేన కలిస్తే మాత్రం ఎక్కువ స్థానాలను అయితే దక్కించుకోవచ్చు. ఇక రాయలసీమ విషయానికి వస్తే.. బీజేపీకి గానీ.. జనసేనకు కానీ ఇక్కడ ఓటు బ్యాంకు చాలా తక్కువ.
బీజేపీ, జనసేన పార్టీలకు రాయలసీమలో బలం లేదు. ఇక గత ఎన్నికల్లో రాయలసీమ కేవలం మూడంటే మూడు స్థాానాల (చంద్రబాబు, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్)ను మాత్రమే టీడీపీ దక్కించుకుంది.రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాను, నల్లమల సరిహద్దుల్లో ఉన్న ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కందుకూరు ప్రాంతాలను కలిపితే ‘గ్రేటర్ రాయలసీమ’ అవుతుంది. ఇక్కడ 67 అసెంబ్లీ స్థానాలున్నాయి. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమను గెలుచుకుంటే సునాయసంగా అధికారం చేజిక్కుతుంది.
ఈ విషయం తెలిసే చంద్రబాబు తాను రాయలసీమ బిడ్డనంటూ కొత్త స్లోగన్ అందుకోగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సైతం కుప్పం నుంచి తన పాదయాత్రను చేపట్టి రాయలసీమలో పర్యటించిన మీదటే ఇతర జిల్లాలపై ఫోకస్ చేశారు. మొత్తంగా రాయలసీమలో సీన్‌ను టీడీపీ మార్చిందంటే చాలు.. ఏపీలో జగన్ సర్కారు నిలువునా కుప్పకూలడం ఖాయం. టీడీపీకి జనసేన తోడైతే.. ఇది పెద్ద కష్టమేమీ కాదు. ప్రస్తుత పరిస్థితులు కూడా టీడీపీకి అనుకూలంగానే ఉన్నాయి. ఇక చూడాలి ఏం జరుగుతుందో..