వైసీపీలో మంత్రి రోజాను ఓడించడానికి పార్టీ పెద్దలు సిద్ధమవుతున్నారా? నగరిలో పరిస్థితులు రోజురోజుకూ ఆమెకు వ్యతిరేకంగా మారుతున్నాయా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. నిజానికి ఈ న్యూస్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది కానీ తాజాగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పర్యటనలో ఈ విషయం మరింత స్పష్టంగా వెలుగులోకి వచ్చింది. మంత్రి పెద్దరెడ్డి రామచంద్రా రెడ్డి, మంత్రి రోజా వర్గాల మద్య విభేదాలు తాజాగా జగన్ నగరి పర్యటన నేపథ్యంలో వెలుగులోకి వచ్చాయి. ఫ్లెక్సీ బ్యానర్లు సాక్షిగా బయటపడ్డాయి.
నగరి నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల వైసీపీ నేతలు జగన్‌కు స్వాగతం చెపుతూ దారిపొడవునా అనేక ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. వాటిలో ఎక్కడా కూడా నగరి ఎమ్మెల్యే మాత్రమే కాదు.. మంత్రిగా ఉన్న రోజా ఫోటోలు ఎక్కడా కనిపించలేదు. అంతేకాదు.. జగన్ పర్యటన నేపథ్యంలో జన సమీకరణకు అనుచరులు ఎవరూ సహకరించలేదని సమాచారం. అంతేకాదు.. వలంటీర్లు రంగంలోకి దిగి ఇంటింటికీ వెళ్లి బతిమిలాడినా కూడా మహిళలు జగన్ సభకు వచ్చేందుకు నిరాకరించారని టాక్. 50 బస్సులు పెట్టినా కూడా వాటిలో జనాలే లేరని సమాచారం.
ఇక ఈ కార్యక్రమంలో నగరి మునిసిపల్ చైర్మన్ కేజే శాంతి చెయ్యి పట్టుకుని మంత్రి రోజాతో చేతులు కలపాలని జగన్ యత్నించగా.. ఇద్దరూ చేతులు కలిపినట్టే కలిపి వెనక్కి తీసేసుకున్నారు. నిజానికి కేజే శాంతి పెద్దిరెడ్డి వర్గానికి చెందిన నాయకురాలు కావడం గమనార్హం. నిజానికి రోజాకు ఒక్కో మండలంలో కనీసం ఒక్క నేత అయినా ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. రనోజా మంత్రి పదవిలో ఉన్నా కూడా ఎక్కడా ఫ్లెక్సీల్లో ఆమె ఫోటో కూడా కనిపించలేదంటే నగరిలో రోజా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికలలో వైసీపీ ప్రభంజనం కొనసాగినప్పుడు కూడా రోజా కేవలం 2,681 ఓట్ల ఆధిక్యతతో మాత్రమే గెలిచారు. ఇక ఇప్పుడు వైసీపీ నేతలంతా ఆమెకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు కాబట్టి ఈసారి రోజా ఓటమి ఖాయమని తెలుస్తోంది. మరి రోజాకు తన కుర్చీ కింద మంటలు అర్థమవుతున్నాయో లేదో చూడాలి.