వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల నేడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో నేటి ఉదయం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసింది. షర్మిలతో పాటు ఆమె భర్త బ్రదర్ అనిల్ కూడా వెళ్లి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే సమావేశంలో ఏం జరిగిందనే విషయాలు మాత్రం బయటకు రాలేదు కానీ తాజా రాజకీయాలపై మాత్రం సోనియాతో షర్మిల చర్చించినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌టీపీని షర్మిల విలీనం చేస్తారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సోనియా గాంధీతో భేటీ చర్చనీయాంశంగా మారింది.దాదాపు గంటన్నర పాటు వీరిద్దరి మధ్య బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ జరిగింది.
ఈ భేటీలో ప్రధానంగా పార్టీ విలీనంపైనే చర్చ జరిగినట్టు సమాచారం. సోనియా నుంచి తనకు ఎలాంటి హామీ వస్తుంది? దాని వల్ల ఎలాంటి ప్రాధాన్యం చేకూరుతుంది? వంటి అంశాలపై షర్మిల చర్చించినట్టు తెలుస్తోంది. అయితే షర్మిల సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపై సోనియా మాట్లాడినట్టు సమాచారం. అయితే చర్చలు ముగిసిన అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా, రాహుల్ గాంధీతో మంచి సమావేశం జరిగిందని, నిర్మాణాత్మక చర్చలు జరిగాయని షర్మిల వెల్లడించారు.
తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా రాజశేఖర్ బిడ్డ నిరంతరం పనిచేస్తుందని షర్మిల తెలిపారు. అలాగే కేసీఆర్‌కు కౌంట్ డౌన్ ప్రారంభం అయిందని షర్మిల పేర్కొన్నారు. షర్మిల సేవలను కాంగ్రెస్ పార్టీ ఏపీలోనే వినియోగించుకుంటుందని అయితే వార్తలు వస్తున్నాయి. ఏపీలో షర్మిల చేత ప్రచారం చేయించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోందట. ఒకప్పుడు జగన్ జైలులో ఉన్న సమయంలో వైసీపీ తరుఫున ప్రచారం చేసి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు షర్మిల యత్నించారు. అసలు ఒకరకంగా చెప్పాలంటే వైసీపీ అధికారంలోకి రావడానికి షర్మిల కీలక పాత్ర వహించారు.