తెలంగాణలో ఇప్పటి వరకైతే ఈసారి కూడా అధికారం బీఆర్ఎస్‌దేనని స్పష్టమవుతోంది. ముందస్తుగానే 4 స్థానాలు మినహా 115 స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించి గులాబీ బాస్ అయితే చేతులు దులుపుకున్నారు. ఇక టికెట్ రాని వాళ్లు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసి ఆ పార్టీ తరుఫున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు అసలు హాట్ టాపిక్ ఏంటంటే.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసిన వారంతా కోవర్టులనే ప్రచారం జరుగుతోంది. తమ పార్టీలో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో వారిని పక్కపార్టీలోకి కేసీఆరే పంపించారా? లేదంటే కాంగ్రెస్ పార్టీ బలపడుతోంది కాబట్టి ఆ పార్టీ ఎత్తులన్నీ తెలుసుకునేందుకు గులాబీ బాస్ ఈ విధంగా ముందుగానే అభ్యర్థుల జాబితా ప్రకటించేసి కొందరిని కోవర్టులుగా పంపారా?
నిన్న మొన్నటి వరకూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన వారందరూ కోవర్టులంటూ జనాల్లోనే ప్రచారం జరిగేది. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు సైతం కోవర్టుల ప్రచారానికి తెరదీశారు. కేసీఆర్ ముందే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీలోకి కొందరు నేతలను పంపారని.. బలమైన నేతలకు 30 కోట్ల చొప్పున ఇచ్చి వారిని నియోజకవర్గాల్లో గెలిపించే బాధ్యతను తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ఎక్కడైతే బీఆర్ఎస్ ఓడిపోయి.. కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు అవకాశం ఉందో అక్కడి అభ్యర్థులందరినీ గట్టు దాటించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొన్ని మీడియా సంస్థలు సైతం ఈ ప్రచారానికి మద్దతుగానే కథనాలను వెలువరిస్తున్నాయి.
తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో తిరిగే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఎవరూ ఏమీ అనొద్దని.. వారంతా మన వాళ్లేనని అన్నారు. తామే కొందరిని సెలక్ట్ చేసి మరీ కాంగ్రెస్ పార్టీలోకి పంపామని వారంతా బీఆర్ఎస్ కోసమే పని చేస్తారని ఇది పక్కా స్కెచ్ అన్నట్టుగా చెప్పారు. ఇంకేముంది? రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన వారంతా కోవర్టులేనన్న ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే నిన్న మొన్నటి వరకూ ఉన్న ప్రచారానికి బాల్క సుమన్ గండి కొట్టారని కొందరు అంటున్నారు. ఒకవేళ సెలక్ట్ చేసి కోవర్టులను పంపిస్తే.. మేము పంపించామహో అని డప్పేసి చెబుతారా? సైలెంట్‌గా ఉండిపోతారు కానీ.. ఇలా చెప్పారంటే ఏంటి అర్థం?.. అర్థం చేసుకున్న వాళ్లకు అర్థమైనంత. నిజంగా వాళ్లు కాంగ్రెస్ లో చేరి ఉంటే. ఏ మాత్రం అధికార పార్టీకి సహకరిస్తారో.. దీంతో BRS ఏమాత్రం లాభపడుతుందో చూడాలి మరి..!