కాదేదీ కవిత కనర్హం అన్నట్టుగా.. ఏపీ రాజకీయాలకు ఏ అంశమూ అనర్హం కానట్టుగా ఉంది. ఒకే అంశాన్ని ప్రధాన పార్టీలు ఎవరికనుగుణంగా వారు మలుచుకుని రాజకీయం చేస్తున్న తీరు నివ్వెరపరుస్తోంది. ప్రస్తుతం ఏపీ పొలిటిక్స్‌లో హాట్ టాపిక్ ఏంటంటే.. ‘ఎన్టీఆర్’ స్మారక 100 రూపాయల నాణెం. ఏపీలో రాజకీయమంతా ఈ నాణెం చుట్టూనే తిరుగుతోంది. ఈ నాణెం విడుదల చేయించింది తామేనంటూ క్రెడిట్ కొట్టేందుకు బీజేపీ.. ఎన్టీఆర్‌కు జాతీయ స్థాయి గుర్తింపు దక్కేలా చేసింది తామేనంటూ టీడీపీ ప్రచారం చేసుకుంటున్నాయి. ఇక మధ్యలో వైసీపీ దూరి వీరి క్రెడిట్‌నంతా గంగలో కలిపేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే లక్ష్మీపార్వతిని రంగంలోకి దింపిందని టాక్.
లక్ష్మీ పార్వతి చేత.. తనను ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందకుండా ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, టీడీపీ చీఫ్ చంద్రబాబు అడ్డుకున్నారని చెప్పించి తద్వారా ఆ రెండు పార్టీలను వైసీపీ అధినేత ఏకకాలంలో టార్గెట్ చేయిస్తున్నారని టాక్. అంతేకాదు.. రాష్ట్రంలోని ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టింది వైసీపీ సర్కారేనని లక్ష్మీపార్వతితో చెప్పిస్తూ క్రెడిట్ కొట్టేందుకు యత్నించింది. ఈ అంశంపై వైసీపీ నేతలు కిమ్మనకుండా ఉండటం కూడా ఇదంతా వైసీపీయే చేయిస్తోందనడానికి నిదర్శనమని ఏపీలో చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికీ బీజేపీ ఏపీ పగ్గాలు అప్పగించడం.. నాణెం విడుదల చేయడం వంటి అంశాలను వినియోగించుకుని ఏపీలో బలోపేతానికి బీజేపీ స్కెచ్ గీస్తోందని టాక్.
ఎన్టీఆర్‌ను అడ్డుపెట్టుకుని కమ్మ సామాజిక వర్గానికి దగ్గరవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్టు సమాచారం. ఇక ఎన్టీఆర్ కాయిన్ విడుదల కార్యక్రమానికి హాజరైనా.. హాజరు కాకున్నా దాన్ని రాజకీయంగా ఎలా వాడుకోవాలా? అని వైసీపీ యోచిస్తోంది. కార్యక్రమానికి హాజరయ్యారు కాబట్టి.. చంద్రబాబు.. బీజేపీకి దగ్గరవుతున్నారనే ప్రచారాన్ని అందుకుంది. ఒకవేళ హాజరవకుంటే ప్రచారం మరోలా ఉండేదని అందరికీ తెలిసిందే. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, చంద్రబాబు పక్కపక్కన కూర్చొన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై టీడీపీ, బీజేపీలను పురందేశ్వరి కలుపుతున్నారని అనిపిస్తోందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు. ఎన్నికల నాటికి బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటారో లేదో కానీ.. వైసీపీ మాత్రం ఇప్పటికే వీరిద్దరి మధ్య పొత్తు ఖాయం అన్నట్టుగానే ప్రచారం చేస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్ కాయిన్ చుట్టూ ఏపీ పొలిటిక్స్ మొత్తం రన్ అవుతుండటం అన్న గారి అభిమానులను కలచివేస్తోంది.