ఏపీలో ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు కాక రేపుతోంది. నాటి యూపీఏ సర్కారు.. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సిద్ధమైనా కూడా ఓ అధికారి మోకాలు అడ్డారట. ఇది విభజన అంశం పూర్తికావడానికి ముందు జరిగిన ఘటన ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏదైనా కాక మీద ఉండగానే ఏ పనైనా జరిపించుకోవాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఫలితం ఏముంటుంది? కానీ ఆ సమయంలో ఒక ఐఏఎస్ అధికారి సైంధవుడిలా మారకుంటే పక్కాగా ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని సమాచారం. అసలేం జరుగుతుంది? రజత్ భార్గవ మోకాలు అడ్డటానికి అసలు కారణమేంటి? అసలు ఆయన ఏం చేశారనేది ఈ కథనంలో చూద్దాం.
ఐఏఎస్ ఆఫీసర్ రజిత్ భార్గవ. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. ఈయన గురించే ఎక్కడ చూసినా హాట్ టాపిక్ నడుస్తోంది. అసలేం జరిగిందంటే.. 2014లో అంటే తెలంగాణ విభజన సమయంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నట్టు పార్లమెంటులో ప్రకటించారు. ఆ తర్వాత ఏడాదే మార్చి మొదటి వారంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. ఆర్థిక శాఖ అనుమతి వస్తే.. ప్రత్యేక హోదా వచ్చి ఉండేది. ఇందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో రజత్ భార్గవ కూడా ఉన్నారు. అప్పట్లో ఆయన కేంద్ర ఆర్థిక శాఖలో బడ్జెట్ విభాగం జాయింట్ సెక్రటరీగా ఉండేవారు. ప్రత్యేక హోదాపై నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి ప్రణాళిక సంఘం ఐదు సమావేశాలు నిర్వహించింది. ఒక్క సమావేశానికి కూడా రజత్ హాజరు కాలేదు.
అయితే ఒక సమావేశానికి మాత్రం రజత్ స్థానంలో ఆయన బదులుగా డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారి హాజరయ్యారు. ఆయన ఏపీ ప్రత్యేక హోదాకు గండి కొట్టేశారు. అదే సమయంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితం వెలువడి.. కేంద్రంలో ప్రభుత్వం మారితే అంతకు ముందు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలేవీ చెల్లవు. అయితే అప్పటి కమిటీలో మెంబర్‌గా ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ సెక్రటరీ పీవీ రమేశ్ ప్రత్యేక హోదాపై నోటిఫికేషన్ జారీ చేయించాలని శతవిధాలుగా యత్నించారట. కానీ ఫలితం శూన్యం. రజత్ కేవలం స్వప్రయోజనం కోసమే ఇలా చేశారనే టాక్ అయితే బీభత్సంగా నడుస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో రోస్టర్ పాయింట్ల ప్రకారం రజత్‌ను తెలంగాణకు కేటాయించడంతో ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్న గొప్ప అధికారి తానేననే మెహర్బానీ కోసమే ఇదంతా చేశారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి 2014లో యూపీఏ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడం.. నరేంద్ర మోదీ అధికారంలోకి రావడం.. ప్రత్యేక హోదాకు పాతరేయడం చకచకా జరిగిపోయాయి.