అన్నా చెల్లెళ్ల అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేం.. నాకు నువ్వు రక్ష.. నీకు ఈ రాఖీ రక్ష అంటూ సోదరీమణులంతా తమ సోదరులకు రాఖీ కడతారు. బాల్యంలో ఇంట్లో ఎప్పుడూ కొట్టుకున్నా.. మనసులో మాత్రం ఒకరిపై ఒకరికి బోలెడంత ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. సోదరిని విడిచి సోదరుడు అసలు ఉండలేడు. ఎప్పుడూ పోట్లాడుకునే వీరిని ‘రాఖీ’ పండుగ ఒక్కటి చేస్తుంది. సోదరుడు.. తన సోదరికి నాన్న తర్వాత నాన్నగా, సోదరి.. అమ్మ తర్వాత అమ్మగా.. జీవితాంతం తోడుగా నిలుస్తారు. అమితమైన ప్రేమను పంచుతారు. హిందూ ధర్మంలో పౌర్ణమి.. అందునా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ రోజునే రాఖీ పౌర్ణమికి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది.
అయితే పురాణాల్లో అయితే రాఖీ కట్టేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలని చెప్పడం జరిగింది. అలాగే పండుగ తర్వాత ఎలా పడితే అలా రాఖీ తీసేయకూడదట. దానికీ కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుసుకుందాం. రాఖీని ఎక్కువ రోజుల పాటు ఉంచుకోకూడదట. అలాగే ఒకవేళ రాఖీ తెగిపోయినా.. విరిగిపోయినా కూడా చేతికి ఉంచకూడదు. వెంటనే తీసేయాలి. అలాగే తీసిన రాఖీని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ప్రవహించే నీటిలో వేయాలి. ఒకవేళ రాఖీ విరిగిపోతే రూపాయి నాణెంతో పాటు చెట్టు కింద ఉంచాలట. దీనికి తోడు రాఖీ కట్టే ముందు సోదరుడు తూర్పు దిక్కున.. సోదరి ముఖం పడమర లేదంటే ఉత్తరం దిశ వైపు తిరిగి ఉండాలట. అలాగే నలుపు రంగు రాఖీలు కట్టకూడదు.
ఇక రాఖీని కట్టించుకునే సోదరులు కూర్చొని మాత్రమే కట్టించుకోవాలి. అయితే మంచంపై మాత్రం కూర్చోకూడదు. మహూరత్ సమయంలో రాఖీ కట్టాలి. భద్రకాలంలో కట్టకూడదు. అలాగే రాఖీ కట్టించుకునే సోదరులు తమ తలను రుమాలుతో కప్పుకోవాలి. శ్రావణ పూర్ణిమ తేదీ నేడు మొదలై రేపు ఉదయం 07:05 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో రాఖీ ఎప్పుడు కట్టాలంటే.. నేటి రాత్రి 9:03 గంటల నుంచి 11:00 గంటల వరకూ.. అలాగే రేపు తెల్లవారుజామున తెల్లవారుజామున 04.03 గంటల నుంచి ఉదయం 07.05 వరకు రాఖీ కట్టవచ్చట. ఆగస్టు 30 రాత్రి సమయంలో పౌర్ణమి గడియలు ఉన్నప్పటికి అది భద్రకాలం కాదు కాబట్టి రాఖీ కట్టకూడదని పురాణాల్లో చెప్పబడింది.