కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటారు. ఈ నానుడినే ఫాలో అవ్వాలని వైసీపీ నానా తంటాలు పడుతోంది. ముఖ్యంగా రాయలసీమ విషయానికి వస్తే టీడీపీకి రెండు కంచుకోటలు ఉన్నాయి. ఒకటి టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీ నియోజకవర్గం కుప్పం కాగా.. మరొకటి నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురం. ఇవి రెండు నియోజకవర్గాలు చాలా కాలంగా టీడీపీకే పట్టం కడుతూ వస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ ఈ రెండు నియోజకవర్గాలపై ఫోకస్ చేసింది. కుప్పంపై ఫోకస్ చేసిన విషయం ఎప్పటి నుంచో తెలిసిందే. కానీ ఈ లిస్ట్‌లో కొత్తగా హిందూపూర్ కూడా వచ్చి చేరింది. ఈ రెండు నియోజకవర్గాల బాధ్యతలను వైసీపీ అధిష్టానం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించింది.
ఇక పెద్దిరెడ్డి తన ఫోకస్ మొత్తం కుప్పం, హిందూపూర్‌పైనే పెట్టారు. గత కొద్దిరోజులుగా పెద్దిరెడ్డి తన మకాంను హిందూపురంలోనే వేశారు. ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిని కూడా ఆయన సెలక్ట్ చేసేశారు. ఈసారి హిందూపూర్ నుంచి దీపికను బరిలోకి దింపాలని డిసైడ్ అయ్యారట. దీనికి కారణాలు లేకపోలేదు. లేడీ సెంటిమెంట్ ఒకటైతే.. ఆమె కురుబ కులానికి చెందిన వ్యక్తి కాగా.. ఆమె భర్త రెడ్డి కులానికి చెందిన వ్యక్తట. దీపికను రంగంలోకి దింపితే ఈ రెండు సామాజిక వర్గాల ఓట్లు అన్నీ తమ పార్టీకే పడతాయని పెద్దిరెడ్డి స్కెచ్ అట. హిందూపూర్ పరిధిలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించడంతో వైసీపీకి ఎక్కడలేని జోష్ వచ్చిందట. ఇక నెక్ట్స్ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపూర్ తమదేనని వైసీపీ భావిస్తోందట.
ఇక బాలయ్యను ఎదుర్కోవడం అంటే సాధారణ విషయం ఏమీ కాదు కాబట్టి ఈసారి హిందూపూర్‌లో ప్రచారానికి ఏకంగా మూడు సార్లు సీఎం జగన్ వెళతారట. బాలయ్య నియోజకవర్గ ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండరని.. నియోజకవర్గ సమస్యలపై పెద్దగా దృష్టి సారించరని వైసీపీ ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారం సంగతి ఎలా ఉన్నా కూడా బాలయ్య కాస్త జాగ్రత్త పడితే మేలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే హిందూపూర్‌లో టీడీపీ కాకుండా మరో పార్టీ జెండా ఎగురవేయడం అంటే ఆషామాషీ విషయమేమీ కాదు. టీడీపీ అనేక సంక్షోభాలను, ఆటుపోట్లను ఎదుర్కొన్న సమయంలోనూ హిందూపురం ప్రజలు టీడీపీకే పట్టం కట్టారు. పైగా ఎదుటి వ్యక్తి ఎంత స్ట్రాంగ్ అయినా కూడా టీడీపీ ముందు నిలబడలేకపోయారు. ఈసారి వైసీపీ శక్తి, యుక్తులన్నీ కూడగడుతోంది కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.