ఏదో పేరంటానికి పిలవలేదు అన్నట్టుగా హడావుడి చేసి.. పిలవండి బాబోయ్ అంటూ అటు రాష్ట్రపతికి, ఇటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖలు రాసి భంగపడిన లక్ష్మీ పార్వతి ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ కుటుంబంపైనే కాలు దువ్వుతున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా రూ.100 నాణెం విడుదలకు తనను పిలవలేదన్న ఉక్రోషాన్ని లక్ష్మీపార్వతి వెళ్లగక్కుతున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌ను సీన్‌లోకి తీసుకొచ్చి.. ఆయన వస్తే.. ఆయనను, చంద్రబాబును కలపాలని పురందేశ్వరి అనుకున్నారంటూ ఆరోపణలకు దిగారు. నాణెం విడుదల కార్యక్రమానికి ఎన్టీఆర్ భార్యగా తనను పిలవకపోవడం తప్పు అని ఆమె అన్నారు.
అసలు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఇన్విటేషన్ చూస్తే ప్రైవేటు ఫంక్షన్‌కి రాష్ట్రపతి గెస్ట్‌గా వెళ్తున్నట్టు ఉందని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ప్రాణాలు తీసిన వాళ్ళు వారసులుగా చలామణి అవుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలకు తెరదీశారు. భార్యగా నాణెం అందుకోడానికి అర్హత తనకు మాత్రమే ఉందని.. వీళ్లకు లేదన్నారు. ప్రాణాలు తీసిన వాళ్ళు నాణెం విడుదలకు ఎలా వెళ్లారంటూ లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తనను ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారో లేదో అయన పిల్లలు సమాధానం చెప్పాలంటూ ఫైర్ అయ్యారు. తనను పిలవకుండా పురంధరేశ్వరి, చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. తాను ఎన్టీఆర్ భార్యను అని మెడలో ఫోటో పెట్టుకుని తిరగాలా? అంటూ లక్ష్మీపార్వతి ప్రశ్నించారు.
అసలు తనను ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారా? ఇల్లీగల్‌గా పెట్టుకున్నారో చెప్పాలనే వరకూ లక్ష్మీపార్వతి వెళ్లారంటే ఆమె ఫ్రస్టేషన్‌లో ఉన్నారు అనుకోవాలా? లేదంటే ఎవరో స్క్రిప్ట్‌ను ఆమె చదువుతున్నారు అనుకోవాలా? పైగా ఎన్టీఆర్ పెళ్లి చేసుకోకుంటే యుగ పురుషుడు అవుతాడా? అంటూ సెటైర్లు. పైగా ఇవి చాలవన్నట్టు ఇప్పటి వరకూ ఎన్టీఆర్ కుటుంబంపై అభిమానంతో ఉన్నానని.. ఇకపై ఆ కుటుంబాన్ని వదిలిపెట్టబోనంటూ మంగమ్మ శపథం ఒకటి. పిలవలేదు.. అయితే వచ్చే నష్టం ఏంటి? ఎందుకంతలా ఎన్టీఆర్ భార్యను అంటూ గుర్తింపు కోసం పాకులాడుతున్నారో లక్ష్మీపార్వతియే చెప్పాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పైగా తనను చులకన చేస్తే ఎన్టీఆర్‌ను చులకన చేసినట్టట. మొత్తానికి తనను పిలవలేదన్న ఉక్రోషాన్ని లక్ష్మీ పార్వతి అయితే ఓ రేంజ్‌లో వెళ్లగక్కారు. మరో అభియోగం ఏంటంటే.. పురందేశ్వరి తండ్రిని వెన్నుపోటు పొడిచిందట. ఇది ఎవ్వరికీ తెలియదట. తనకు మాత్రమే తెలుసట. పైగా బావామరదళ్లు ఏకమైపోయారంటూ శాపనార్థాలు. బాబోయ్ లక్ష్మీపార్వతిని ఎవరికైనా చూపించండ్రా అని నెటిజన్లు అంటున్నారు.