తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా ఈరోజు ఆగష్టు 28 న కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల రూపాయల స్మారక నాణేన్ని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా విడుదల చేసారు. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఉదయం 10.30గంటల నుంచి జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరితో పాటు నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు, రాజకీయ, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ. 100 స్మారక నాణేన్ని 50శాతం వెండి, 40శాతం రాగి, ఐదు శాతం నికెల్, ఐదు శాతం జింక్ తో తయారు చేశారు. నాణేం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్టీఆర్ జీవిత విశేషాలతో 20 నిమిషాలపాటు వీడియో ప్రదర్శన ఇచ్చారు. తర్వాత రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ స్మారక నాణెంను విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు.
నందమూరి తారక రామరావు శతజయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను అన్నారు. భారతీయ సినిమా చరిత్రలో నందమూరి తారకరామారావు ఎంతో ప్రత్యేకమని.. రాజకీయాల్లోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. కృష్ణుడు, రాముడు వంటి పాత్రల్లో ఆయన నటన అద్భుతం అన్నారు. ఎన్టీఆర్ రామాయణ ,మహాభారతాలకు అనేక పాత్రలలో జీవించారని.. మనుషులంతా ఒక్కటే అనే సందేశాన్ని తమ సినిమాల్లో ఇచ్చారన్నారు. పేదల అభ్యున్నతికి ఎన్టీఆర్ కృషి చేశారన్నారు.