ఏపీలో సర్వేలు రకానికొకటి చెబుతున్నాయి. ఇటీవల చేసిన టైమ్స్ సంస్థ ఇచ్చిన సర్వేకు.. తాజాగా ఇండియా టుడే సర్వేకు సంబంధమే లేదు. అయితే సీఎం జగన్ చేయించిన ఐప్యాక్ ఫిగర్స్ సర్వే.. ఇండియా టుడే సర్వేకు దాదాపు సమానంగా ఉంది. రెండు సర్వేల సారాంశం ఒక్కటే. ఏపీలో అధికారం వైసీపీ చేజారి టీడీపీ సొంతమవుతుంది. అసలు టీడీపీకి పొత్తే అవసరం లేదని.. సింగిల్‌గా అధికారాన్ని దక్కించుకుంటుందని ఇండియా టు డే స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే టీడీపీ 15 ఎంపీ స్థానాలను.. 105 నుంచి 110 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంటుందని ఇండియా టుడే తేల్చింది. ఇటీవల లీకైన ఐప్యాక్ సర్వే కూడా సరిగ్గా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
నిజానికి ఏపీలో బీజేపీ, జనసేనలకు ఏమాత్రం ఆదరణ లేదన్నది గత ఎన్నికల్లో తెలిసింది.అలాగే ఇటీవల ఆ రెండు పార్టీలు కలిసి పోటీచేసిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు రాలేదు. ఆ తరువాత బద్వేల్, ఆత్మకూరు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ కుప్పకూలింది. ఏదో స్థానిక సంస్థల ఫలితాలను చూపిస్తూ జనసేన బలపడినట్టు భావిస్తోంది కానీ అది టీడీపీ బరిలోకి దిగకపోవడం కారణంగానే జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఏపీలో పోటీ కేవలం టీడీపీ, వైసీపీల మధ్యే ఉంటుందని ఇండియా టుడే సర్వే తేల్చింది. ఈ సంస్థ ప్రతి ఆరు నెలలకోసారి ఈ సర్వే చేస్తుంది. జనవరిలో చేసిన సర్వేలో అయితే టీడీపీకి 7 - 10 ఎంపీ స్థానాలే వస్తాయని ఈ సంస్థ సర్వే తెలిపింది. ఇప్పుడు స్థానాలు పెరిగాయి.
మొత్తానికి లీకైన ఐ ప్యాక్ సర్వేతో ఇప్పుడు ఇప్పుడు ఇండియా టుడే సర్వే టీడీపీలో ఫుల్ జోష్ నింపింది. ఇక ఇప్పుడు ఏమాత్రం ఎన్నికలను లైట్ తీసుకోకుండా రెట్టించిన ఉత్సాహంతో టీడీపీ పని చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం టైమ్స్ నౌ సంస్థ వెలువరించిన ఫలితం ఎవరికీ నమ్మశక్యంగా లేదు. ప్రభుత్వంపై అంత వ్యతిరేకత కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంటే.. గతంలో కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుందని చెప్పడం విడ్డూరంగా అనిపించింది. ఆ తర్వాత ఆ సంస్థ వైసీపీ నుంచి ముడుపులు తీసుకున్న వ్యవహారం బయటకు రావడంతో అసలు కథ బయటకు వచ్చింది. సింగిల్‌గా రంగంలోకి దిగినా అధికారం పక్కాగా దక్కించుకుంటుందని ఇండియా టుడే సంస్థ తేల్చి చెప్పింది కాబట్టి మరి ఇక ముందు టీడీపీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.