తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు ఎంపీలు మరికొంత కాలం పాటు ఎంపీలుగా ఉండగల వైభవాన్ని పక్కనెబెట్టి అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు. నిజానికి ఇదొక పెద్ద వింతో విశేషమో కాదు. సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఒక పార్టీకి చెందిన ఎంపీలంతా మూకుమ్ముడిగా అసెంబ్లీకి పోటీపడటమనేది ఆసక్తికరం. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పక్కా స్ట్రాటజీతో ముందుకు వెళుతోంది. రాష్ట్రంలో అధికార పీఠం దక్కించుకునేందుకు అవసరమైన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ముగ్గురు లోక్‌సభ సభ్యులు ఉన్నారు. టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ముగ్గురూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. గత ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లకు గానూ కాంగ్రెస్ పార్టీ మల్కాజ్‌గిరి, భువనగిరి, నల్గొండలను సొంతం చేసుకుంది. ఇప్పుడు రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డిలు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్నారు. రాష్ట్రంలో తీసుకుంటే ఇదొక అద్భుతమైన స్టెప్. కానీ దేశంలో చూసుకుంటే మాత్రం కాస్త కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిణామమే. ఈ ఎంపీలు ముగ్గురూ అసెంబ్లీ బరిలో దిగితే మాత్రం తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అనే సంకేతాలను జనాల్లోకి తీసుకెళుతున్నట్టే.