సినీ పరిశ్రమ, ఏపీ.. కవల పిల్లల్లాంటివి. ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలంతా దాదాపు ఆంధ్రాకు చెందిన వారే. ఇక ఏ సినిమా విడుదలైనా కూడా ఏపీలో సక్సెస్ టాక్ తెచ్చుకుందంటే చాలు.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం. తెలుగు సినీ పరిశ్రమకు ఏపీ పుట్టినిల్లు. అలాంటి ఏపీ.. తెలుగు సినిమా ఆస్కార్ అవార్డ్ సాధించినా పట్టించుకోదు.. 11 జాతీయ అవార్డులు వచ్చినా లైట్. నిజానికి ఆ సంతోషాన్ని తన చేజేతులా ఏపీ ప్రభుత్వమే నాశనం చేసుకుంది. దేశానికి ఎంతో గర్వకారణమైన రెండు అద్భుత విషయాలను సెలబ్రేట్ చేసుకోకపోవడం కంటే దురదృష్టం మరొకటి ఉందా? అసలు వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సినీ పరిశ్రమను సైతం రాజకీయ ప్రత్యర్థులుగానే భావిస్తూ వస్తోంది.
అది చాలదన్నట్టు రామ్ గోపాల్ వర్మ వంటి వారిని తనకు అనుకూలంగా సినిమాలు తీయించేందుకు వినియోగించుకుంటున్నారు. పైగా తన ప్రత్యర్థులను ఇలాంటి వారిని వాడుకుని ఇష్టానుసారంగా మాటలు అనిపిస్తున్నారు. ఇక చిరంజీవి అంతటి వారు చేతులు జోడించి ప్రార్థించినా కనికరించలేదు. అది చాలదన్నట్టు చిరు చేతులు జోడించిన ఫోటోను మీడియాకు విడుదల చేసి అవమానాల పాలు చేసింది. కనీసం సినిమాలు విడుదలవుతున్నాయంటేనే రకరకాల అడ్డంకులు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో సినిమాలు ఆడించుకోవడం కష్టమనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఈ కారణంగానే ఇప్పుడు వస్తున్న సినిమాలను పరిశీలిస్తే అన్నీ తెలంగాణ నేపథ్యంలోనే ఉంటున్నాయి. వాటికి తెలంగాణ ప్రభుత్వం నుంచి.. ప్రజల నుంచి అద్భుతంగా ఆదరణ లభిస్తోంది. దీంతో తెలంగాణ నేపథ్యమే బెస్ట్ అన్న రీతిలో దర్శకనిర్మాతలు వెళుతున్నారు.
మొత్తానికి ఏకంగా సీఎం జగనే స్వయంగా ఆహ్వానించినా కూడా తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి ససేమిరా అంటోంది. అసలు సినీ పరిశ్రమ సాధిస్తు్న్న గొప్ప గొప్ప విజయాలను సైతం ఏపీ ప్రభుత్వం లైట్ తీసుకుంటూ ఉండటంతో రాష్ట్రానికి లభించాల్సిన ఖ్యాతి కూడా లభించడం లేదు. ఒక తెలుగు సినిమా ఆస్కార్ అవార్డ్ బరిలో నిలవడమే ఒక అద్భుతమని భావిస్తున్న సమయంలో ఏకంగా అవార్డ్ కొట్టుకొచ్చింది. 63 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలోనే జాతీయ ఉత్తమ నటుడితో పాటు మరో ఐదు అవార్డులు తెలుగు సినిమాకు వరించినా కూడా ఏపీ ప్రభుత్వం మిన్నకుండిపోయింది. నిజంగా ఏపీ ప్రజలు ఈ విషయంలో చాలా దురదుష్టవంతులనే చెప్పాలి. ప్రభుత్వం చేస్తున్న పనికి సినీ పరిశ్రమ ఏపీకి రోజురోజుకీ మరింత దూరమవుతోంది.