ఏదైనా పెళ్లో లేదంటే పేరంటానికో ఎవరైనా మనల్ని పరిగణలోకి తీసుకోకుండా పిలవలేదనుకోండి.. వెళ్లి నన్ను పిలవడం మరిచినట్టున్నారు.. కాస్త పిలవండి ప్లీజ్ అంటే ఎలా ఉంటుంది? అస్సలు బాగోదు కదా. ఇదంతా ఎందుకు అంటే లక్ష్మీ పార్వతి ఇదే పని చేశారు. సోమవారం ఢిల్లీలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్రం ఆయనను గౌరవించడానికి ప్రత్యేకంగా ఆర్బీఐ ద్వారా రూ. వంద నాణెం విడుదల చేస్తోంది. ఈ కార్యక్రమం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది.
ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీ పార్వతి తనను పిలవలేదంటూ.. మరిచిపోయి ఉంటారు.. కాబట్టి తనను పిలవాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి ఎవరిని పిలవాలన్న జాబితా కూడా చాలా రోజుల క్రితమే ఫైనలైజ్ అవడం.. అందరికీ ఆహ్వానం పంపడం కూడా అప్పుడే పూర్తైంది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, పురందేశ్వరి, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ వెళుతున్నారు. అయితే ఎన్టీఆర్ కుటుంబంలో ఏ ఒక్కరూ కూడా లక్ష్మీపార్వతిని తమ కుటుంబ సభ్యురాలిగా గుర్తించడం లేదన్నది జగమెరిగిన సత్యం.
తాను ఎన్టీఆర్ భార్యనని.. కాబట్టి తనను కూడా పిలవాలని రూ.100 నాణెం విడుదల కార్యక్రమానికి పిలవాలని లక్ష్మీపార్వతి అడుగుతున్నారు. అధికారులు ఏమరుపాటులో మరిచిపోయి ఉంటారు.. ఎక్కడో తప్పిదం జరిగింది కాబట్టి తనను పిలవాలని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ కారణంగా ఆమె అబాసు పాలవడం తప్ప సాధించిందేముంది? అసలు తనను పిలవమని అడిగి మరీ వెళితే ఆమెకు గౌరవం ఉంటుందా? పోనీ పిలవమని అడిగినా కూడా పిలవలేదు కదా.. ఇంకా రేపొక్కరోజే టైం ఉంది. పిలుస్తారన్న నమ్మకం కూడా లేదు. ఇలా అడిగినా కూడా పిలవకుంటే ఎంత అవమానకరంగా ఉంటుంది? పైగా వైసీపీ చేరి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై ఇష్టానుసారంగా కామెంట్స్ చేశారు. పోనీ ఎన్టీఆర్‌ను అవమానిస్తుంటే ఏమైనా ప్రశ్నించారా? అదీ లేదు. ఇలాంటి వాటికి తగుదునుమ్మా అని తయారైపోతే.. పరువు పోగొట్టుకోవడం తప్ప మరొకటి ఉండదు.