రాజకీయాల్లో సినీ సెలబ్రిటీల జోరు మరింత ఎక్కువైంది. రోజుకో సినీ సెలబ్రిటీ రాజకీయాల్లో చేరిపోతున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్, జయప్రద, విజయశాంతి, రోజా తదితరులు రాజకీయాల్లోకి వచ్చేశారు. ఇలా రావడం కొత్తేమీ కాదు.. ఒకప్పుడు ఎన్టీఆర్ స్థాపించినదే కదా.. తెలుగుదేశం పార్టీ. ఆయన ముఖ్యమంత్రిగా కూడా పని చేసి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి తెలియజేశారు. ఇక అటు తమిళనాట ఎంజీఆర్, జయలలిత వంటి వారు ఒక చరిత్రగా నిలిచిపోయారు. ఇలా చాలా మంది నటీనటులు రాజకీయాల్లో సత్తా చాటారు.. చాటుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల తరుణం.
కొందరు సినీ సెలబ్రిటీలు వివిధ పార్టీల్లో చేరిపోయి ఆ పార్టీ నుంచి అసెంబ్లీ బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కొందరు నిజంగా రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తుంటే.. మరికొందరిని బలవంతంగా లాగేస్తున్నాం. అలాంటి వ్యక్తుల్లో ఒకరే ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ఆయన కాంగ్రెస్ తరుఫున పోటీ చేసేందుకు గోషా మహల్ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారంటూ ప్రచారం నడిచింది. ఇటీవల రాజీవ్ గాంధీ యూత్ క్విజ్ పోటీల ప్రారంభోత్స వంసందర్భంగా కూడా రాహుల్ సిప్లిగంజ్‌ను కాంగ్రెస్ నేతలు ఆహ్వానించారు. దీంతో రాహుల్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఆయన గోషామహల్ నుంచి పోటీ చేయబోతున్నారంటూ టాక్ నడిచింది.
తాజాగా దీనిపై రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ ఇచ్చాడు. అసెంబ్లీ ఎన్నికల్లో గోషా మహల్ సీట్ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నట్లు వచ్చిన పుకార్లను సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కొట్టిపారేశాడు. తాను పొలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చేదే లేదు అన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. నిజానికి బిగ్‌బాస్ విన్నర్ అయ్యాక రాహుల్‌కు కాలం బాగా కలిసొచ్చింది. ఒక్కసారిగా ఆయన రేంజే మారిపోయింది. ఇక ఆర్ఆర్ఆర్‌లో ఆయన పాడిన పాటకు ఆస్కార్ రావడంతో రాహుల్ రేంజ్ మరింత పెరిగింది. ఇప్పుడు రాహుల్ కెరీర్ మూడు పువ్వులు - ఆరు కాయల మాదిరిగా ఉంది. ఈ సమయంలో తన కెరీర్‌ను పక్కనబెట్టి రాజకీయాల్లోకి రావడం అంటే కాస్త ఆలోచించదగ్గ పరిణామమే. మొత్తానికి రాహుల్ సిప్లిగంజ్ తనపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ అయితే పెట్టేశాడు.