టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఉద్దేశిస్తూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేశారు. తనను థర్డ్ గ్రేడ్ డైరెక్టర్ అంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఆయన కౌంటర్ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు అసలు నారా లోకేష్‌ని కనాలని అనుకోలేదని.. కానీ ఆయనకి లోకేష్ పుట్టారని.. కాబట్టి ఇదొక బయలాజికల్ యాక్సిడెంట్ అంటూ సంచలనానికి వర్మ తెరదీశారు. తానేదో కష్టపడి పైకి వచ్చానని.. అయితే తన విజయాలు, నారా లోకేష్ విజయాలను పక్కపక్కన బెట్టి చూస్తామన్నారు. తానేమీ థర్డ్ గ్రేడ్ యాక్టర్ కాదని చెప్పారు.
ఇటీవల రామ్ గోపాల్ వర్మ వైసీపీ ప్రభుత్వానికి కలిసొచ్చేలా సినిమాలు రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వ్యూహం సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రకాశం బ్యారేజ్‌పై జరిగింది. ఈ షూటింగ్‌కు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు కానీ నారా లోకేష్ పాదయాత్రకు మాత్రం అడ్డంకులు సృష్టించారు. ఈ విషయమై నారా లోకేష్ మాట్లాడుతూ.. వర్మ సినిమాకు పర్మిషన్ ఇస్తారు కానీ, తన పాదయాత్రకు మాత్రం ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదని ఓ మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ఆ సమయంలోనే ఆయన ఓ థర్డ్ గ్రేడ్ సినిమాలు చేసే డైరెక్టర్ అంటూ సెటైర్లు పేల్చారు.
ఆ సెటైర్లకు తాజాగా వర్మ అసలు లోకేష్ పుట్టుక ఓ బయలాజికల్ యాక్సిడెంట్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభలకు జనం వస్తున్నారని.. తన సభలకు రావడం లేదనే అభద్రతా భావంలో నారా లోకేష్ ఉన్నారన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని వర్మ అన్నారు. అసలు సినిమా షూటింగ్‌లకు, రాజకీయ సభలకు ఇచ్చే పర్మిషన్లను ఒకే గాటన ఎలా కడతారంటూ ఆర్జీవీ ప్రశ్నించారు. షూటింగ్ పర్మిషన్ కు, మీటింగ్ పర్మిషన్ కు మధ్య చాలా వ్యత్యాసముందన్నారు. రాజకీయ లబ్ది కోసం నారా లోకేష్ అలాంటి వ్యాఖ్యలు చేస్తే తప్పులేదని.. కానీ ఆయన ఏదైనా భ్రమలో మాట్లాడితే మాత్రం అర్జంటుగా సైక్రియాటిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాలని ఆర్జీవీ పేర్కొన్నారు. అసలు లోకేష్ అమాయకత్వంతో మాట్లాడతారా? లేదంటే జనం అమాయకులనుకుని మాట్లాడతారా? అనేది తెలియడం లేదన్నారు.