గవర్నర్ తమిళిసై ఢీ అంటే ఢీ అన్నారు. ఒకానొక సమయంలో పుతిన్.. జెలెన్‌స్కీల మాదిరిగా ఉంది వ్యవహారం. కనీసం అధికారిక కార్యక్రమాలకు కూడా ఆమెను ఆహ్వానించిన పాపాన పోలేదు. ఉప్పు నిప్పు అన్నా కూడా తక్కువే. కానీ సడెన్‌గా కేసీఆర్‌లో మార్పు. ఒక్కసారిగా ఆయన గౌతమ బుద్దుడు అయిపోయారు. అటు తమిళిసై.. ఇటు చినజీయర్‌ను అక్కున చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఆమెతో రాజ్‌భవన్‌లో సీఎం కేసీఆర్ ఏకాంతంగా భేటీ అయ్యారు. నేడు తమిళిసై సచివాలయానికి వస్తున్నారు. మరోవైపు ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌కు కేసీఆర్‌కు మధ్య ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహావిష్కరణ నేపథ్యంలో సంబంధాలు బెడిసి కొట్టాయి. ఇప్పుడు మళ్లీ చిగురిస్తున్నాయి.
ఉన్నట్టుండి అటు రాజ్‌భవన్‌కు.. ప్రగతి భవన్‌కు దూరం పూర్తిగా తగ్గిపోయింది. ఇక చినజీయర్‌కు సైతం దగ్గరయ్యేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. అసలు ఎందుకు సడెన్‌గా కేసీఆర్‌లో ఇంత మార్పు? ఎందుకు కేసీఆర్ రాజీ పడ్డారు? వీటన్నింటి వెనుక ఉన్న కారణం బీజేపీకి దగ్గరవడమేనా? సీఎం కేసీఆర్, ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌ను మంత్రి ఎర్రబెల్లి కలుపుతున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని వల్మీడి గ్రామం వేదికగా ఓ ఆథ్యాత్మిక కార్యక్రమం జరగనుంది. దీని వేదికగా వీరిద్దరూ తిరిగి దగ్గరకానున్నారు. అసలే అసెంబ్లీ ఎన్నికలు.. ఇప్పుడు ప్రతి ఒక్క కులం, మతానికి చాలా దగ్గరవ్వాల్సిన తరుణం. ఈ సమయంలో చినజీయర్, తమిళిసై వంటి వారితో విరోధం హిందువుల్లో వ్యతిరేకతను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ సమయంలో కేసీఆర్‌లోని రాజకీయ చాణక్యుడు నిద్ర లేచాడని ప్రచారం జరుగుతోంది.
హిందూ ఓటు బ్యాంక్ సమీకరణకు ఎర్రబెల్లిని అస్త్రంగా చేసుకుని తనదైన శైలిలో కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అసలు కేసీఆర్ సమ్మతి లేకుండా ఎవరితోనైనా వేదిక పంచుకుంటారా? అసలు అలాంటి వేదికను ఏర్పాటు చేసేంత సీన్ ఏ బీఆర్ఎస్ నేతకైనా ఉందా? కేవలం హిందూ ఓటు బ్యాంకు కోసమే కేసీఆర్ చాణక్యం మేరకే ఇదంతా జరుగుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వచ్చే నెల 4న చిన జీయర్, కేసీఆర్ కలయికకు అదేనండి.. రూ.30 కోట్లతో నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. అసలే బీజేపీ, బీఆర్ఎస్‌ను బీ-టీమ్‌గా సంబోధిస్తూ కాంగ్రెస్ పార్టీ రచ్చ చేస్తోంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటిని వినియోగించుకుని ఈ రెండు పార్టీలూ ఒక్కటేనన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా జనంలోకి తీసుకెళ్లేందుకు యత్నిస్తోంది. ఇది గట్టిగా జనాల్లోకి వెళ్లిపోయి అసలుకే ఎసరొస్తుందనుకుంటే కేసీఆర్ వల్మీడి ప్రోగ్రాంకి హాజరు కాకపోవచ్చు. ఎవరేం అనుకుంటే నాకేంటిలే అనుకుంటే తప్పక హాజరవుతారు.