ఆంధ్రప్రదేశ్ రాజకీయం తెలంగాణ మాదిరిగా కాదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీదే హవా అని స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఏపీలో అలా కాదు.. ప్రధాన పార్టీల అధినేతలు ఇద్దరూ సమ ఉజ్జీలే. అంటే రాజకీయంగా సూపర్ స్ట్రాంగ్. అందుకే ఎవరి సత్తా ఏంటనేది చెప్పడం కష్టం. గత ఎన్నికల్లో అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అంత పట్టుదలగా కనిపించలేదు కానీ ఈసారి ఉడుము పట్టు పట్టి కూర్చొన్నారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలనే తరహాలో దూసుకెళుతున్నారు. ఒకరకంగా ఆయనకు ఒక పాజిటివ్ వే అయితే మంగళగిరిలో ఏర్పడింది. గత ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
అప్పటి నుంచి కూడా నారా లోకేష్ ఓడిపోయాను కదా అని వెన్ను చూపించలేదు. ఎన్నో అవహేళనలను ఎదుర్కొని నిలబడ్డారు. ఆయన మాట తీరుపై ఎన్నో మార్లు వైసీపీ నేతలు హేళన చేశారు. చివరకు ఆయనను బాడీ షేమింగ్ కూడా చేశారు. అయినా సరే స్లిమ్ అయిపోయి బరిలో నిలిచారు తప్ప కృంగిపోయి ఇంట్లో కూర్చోలేదు. ఫలితంగా మంగళగిరిలో నారా లోకేష్‌కు సానుకూల వాతావరణం ఏర్పడింది. ఆయనకు ప్రజల్లో బలం విపరీతంగా పెరిగింది. ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే.. నారా లోకేష్‌కు ఎదురు నిలిచేది ఎవరు? ఈ సారి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి కాదని అయితే స్పష్టంగా తెలుస్తోంది. మరి ఎవరు?
మంగళగిరిలో మరోసారి లోకేష్ ను ఓడించి టీడీపీని, చంద్రబాబును దెబ్బకొట్టాలనే వైసీపీ అధినేత జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని టాక్. అయితే ఈసారి మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి మారతారట. ఆర్కేను చాలా కాలంగా జగన్ దూరం పెడుతూ వస్తున్నారు. నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డిపై వ్యతిరేకత వ్యక్తమవుతుందని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. అంతేకాకుండా రెడ్డి సామాజిక వర్గం కూడా ఆళ్లకు పూర్తి వ్యతిరేకంగా మారిందని టాక్. ఐ ప్యాక్‌తో పాటు జగన్ చేయించిన సర్వేల్లోనూ ఫలితం ఆళ్లకు నెగిటివ్‌గానే ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో నారా లోకేష్‌పై పోటీకి ఎవరిని నిలబెట్టాలనే సంశయంలో వైసీపీ ఉందట. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుల్లో ఒకరిని మంగళగిరిలో బరిలో దించే యోచనలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ ముగ్గురిలో నారా లోకేష్‌కు ఎవరు ఎదురు నిలుస్తారో చూడాలి.