తెలంగాణలో బీఆర్ఎస్ మినహా ఏ పార్టీ కూడా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. కేసీఆర్ నాలుగు స్థానాలకు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఇప్పుడు బీజేపీ నాయకురాలు రాములమ్మ ఆయనకే సవాల్ విసురుతున్నారు. ఇప్పటి వరకూ అభ్యర్థుల జాబితా విషయంలో కనీసం కసరత్తు కూడా ప్రారంభించని బీజేపీ ఇప్పుడు కేసీఆర్‌పై విజయశాంతిని నిలబెట్టే యోచనలో ఉందంటూ ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. నిజానికి గతంలో మెదక్ ఎంపీగా పనిచేసిన రాములమ్మ ఈసారి కూడా ఎంపీగానే పోటీ చేయాలని తొలుత భావించారట.
ఆ తరువాత సీన్ మారిపోయింది. ఇప్పుడు కేసీఆర్‌పై పోటీ చేస్తానంటూ రాములమ్మ ట్వీట్స్ చేస్తున్నారు. కేసీఆర్‌కి సరైన ప్రత్యర్థిని తానేనని చెబుతున్నారు. అవకాశం తనకే ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ కు రాములమ్మ విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. బీజేపీ హై కమాండ్ సైతం సానుకూలంగానే స్పందిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. సీఎం కేసీఆర్ రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్న విషయం తెలిసిందే. వాటిలో కామారెడ్డి ఒకటి. అయితే బీజేపీ అభ్యర్థిగా విజయశాంతిని కామారెడ్డి బరిలో దింపేందుకు కమలం పార్టీ కసరత్తు నిర్వహించింది.
రాములమ్మను బరిలోకి దింపుతారు సరే.. కానీ కేసీఆర్‌ను ఎదుర్కోగలిగే సత్తా ఆమెకు ఉందా? అనేది ఇప్పుడు ప్రధానంగా తలెత్తుతున్న ప్రశ్న. నిజమే.. కేసీఆర్‌కు ఆమే కాదు.. ఎవరు ఎదురెళ్లినా నెగ్గడం కష్టమే. కవితపై గెలిచినంత ఈజీ కాదు కేసీఆర్‌పై గెలవడం అంటే. ఆ విషయం బీజేపీకి కూడా తెలియనిది కాదు కానీ ఎవరో ఒకరిని నిలబెట్టాలి కాబట్టి విజయశాంతి సుముఖత వ్యక్తం చేస్తుండటంతో ఓకే అన్నట్టుగా బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక కేసీఆర్‌ను ఎదుర్కోవడం అంత తేలికేమీ కాదని.. విజయశాంతికి కూడా తెలియనిది కాదు కానీ ఏకంగా కేసీఆర్‌పైనే పోటీ అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవొచ్చన్నది ఆమె ఆలోచనగా తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవ్వడంతో పాటు సెంట్రల్‌లో చిన్నగా స్థానం సంపాదించవచ్చని విజయశాంతి యోచిస్తున్నట్టు సమాచారం.