ఏపీలో అధికార వైసీపీ వారసత్వ రాజకీయాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఏదో మాట వరసకు అన్నారో నిజంగానే అన్నారో కానీ అప్పట్లో వైసీపీ అధిష్టానం ఈ ఎన్నికల్లో మీరు పోటీ చేయండి.. వచ్చే ఎన్నికల్లో వారసులకు టికెట్స్ ఇస్తామని చెప్పింది. అలాగే ఈసారి మహిళలకు పెద్ద పీట వేస్తామని చెప్పింది. ఈ రెండు మాటలను పార్టీ నేతలు కొందరు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. తమ వారసులకు టికెట్ కేటాయించాల్సిందేనని పట్టుబట్టి కూర్చొన్నారు. దీంతో వైసీపీ వారసత్వ రాజకీయాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే నేతలు ఏమాత్రం ఆగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ముందుగా తమ కుమారులకు టికెట్ కన్ఫర్మ్ చేస్తూ జాబితా రిలీజ్ చేస్తే ఇప్పటి నుంచి ప్రచార బరిలో నిలుస్తారని అంటున్నారు.
ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉంది. కానీ అధిష్టానానికి ఇప్పటి నుంచి వారసుల తలనొప్పి ప్రారంభమైంది. మచిలీపట్నం సభ సాక్షిగా మాజీ మంత్రి పేర్ని నాని రాజకీయాలకు రిటైర్‌మెంట్ ప్రకటించేశారు. తన కుమారుడు కృష్ణమూర్తికి ఈసారి అవకాశం ఇవ్వాలని సభ సాక్షిగా సీఎంను కోరారు. భూమన కరుణాకర్ రెడ్డిది ఇదే పరిస్థితి. ఈ సారి తన కుమారుడు అభినయ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా తన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి టికెట్ కావాలంటున్నారు. బాబోయ్.. వారసత్వ గోల మామూలుగా లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ కుమారుల కోసం తమ నియోజకవర్గాలను వదిలి వెళ్లేందుకు సైతం సిద్ధంగా ఉన్నారంటే తమ వారసులకు టికెట్ ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థమవుతుంది.
ఇక శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు తన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడికి.. అసెంబ్లీ స్పీకర్ గా కొనసాగుతున్న తమ్మినేని సీతారాం ఆమదాలవలస ఎమ్మెల్యే టికెట్ తన కుమారుడు చిరంజీవి వెంకటనాగ్‌కి ఇవ్వాలని.. గోదావరి జిల్లాలలో నుంచి తోట త్రిమూర్తులు, మంత్రి పినెపె విశ్వరూప్, రాయలసీమ జిల్లాల నుంచి శిల్పా మోహన్ రెడ్డి, ప్రకాశం నుంచి బాలినేని, వైవీ సుబ్బారెడ్డి వంటి సీనియర్ నేతలు తమ కుమారులకు ఎలాగైనా టికెట్ ఇప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కొందరు ఎమ్మెల్యేలు తమ ఇంట్లోని మహిళలను బరిలో దింపాలనుకుంటున్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా తన కుమార్తె నూరి ఫాతిమాను శాసనసభకు పంపాలని భావిస్తున్నారు. అలాగే టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నా దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం.