గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ అవార్డ్స్‌లో టాలీవుడ్ ప్యూర్ డామినేషన్ కనపరిచింది. దాదాపు 7 దశాబ్దాల చరిత్రలో మొట్టమొదటిసారి ఓ తెలుగు నటుడు బెస్ట్ యాక్టర్‌గా అవార్డు గెలుచుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ అవార్డు గెలుచుకోగా.., రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఉత్తమ జాతీయ చిత్రం అవార్డు వచ్చింది. అంతేకాదు మరో 5 జాతీయ అవార్డులు కూడా ఈ సినిమాకు వరించడం.. మరోసారి ఆ సినిమా సత్తా చాటినట్లు అయింది. అలాగే ఉత్తమ తెలుగు సినిమాగా ‘ఉప్పెన’ సొంతం చేసుకోగా.. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండపొలం సినిమాలోని దమ్ దమ్ సాంగ్‌కి బెస్ట్ లిరిసిస్ట్‌గా చంద్రబోస్‌కు అవార్డు దక్కింది. ఇక తన పాటలతో ప్రపంచం ఊగిపోయేలా చేసిన రాక్‌స్టార్ దేవిశ్రీ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పుష్ప సినిమాకు జాతీయ అవార్డ్ సొంతం చేసుకున్నారు.
మొత్తంగా అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎక్కడ చిన్న చూపు చూడబడుతుందో అక్కడే.. మీసం మెలేసి ఒకే సారి 10 జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడం అనేది సామాన్య విషయం కాదు. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి స్వర్ణయుగమని చెప్పుకోవాలి. ఆస్కార్‌లో ఇండియన్ సినిమా పవర్ చూపిన తెలుగు సినిమా ఇండస్ట్రీపై.. ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. లేదంటే.. ఈ అవార్డుల వరకు ఎప్పుడూ సౌత్‌కి సంబంధించి తమిళ సినిమా ఇండస్ట్రీదే ఆధిపత్యంగా ఉండేది. ఈసారి మాత్రం నారాయణ స్కూల్ యాడ్ తరహాలో చెప్పాలంటే.. 1,2,3... టాప్ 10 టాలీవుడ్‌వే! ఇంకా చెప్పాలంటే క్లీన్ స్వీప్.
మరీ ముఖ్యంగా బెస్ట్ యాక్టర్ అవార్డు ఇంత వరకు ఏ తెలుగు హీరోకి రాకపోవడం విషయంలో.. తెలుగు ప్రేక్షకులే కాదు.. నటీనటులు కూడా డిజప్పాయింట్‌గానే ఉన్నారు. కానీ పుష్పరాజ్ మ్యానరిజమ్‌కి ఇంటర్నేషనల్ స్థాయిలో జనాలు ఫిదా అయ్యారు. ఆయన మేకోవర్, ఆ సినిమా కోసం బన్నీ పడిన కష్టం.. కరెక్ట్ ఛాయిస్ అనేలా.. మరో మాట కూడా ఎవరి నుంచి వినబడలేదంటే.. నిజంగా అల్లు అర్జున్ అర్హుడు. అలాగే అసలీ గుర్తింపుకు కారణమైన రాజమౌళిని పక్కన పెట్టినా.. ఆయన డైరెక్ట్ చేసిన RRR ఉత్తమ జాతీయ చిత్రంగా గుర్తింపు పొందడంతో పాటు బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ రీరికార్డింగ్, బెస్ట్ సింగర్ మేల్, బెస్ట్ వీఎఫెక్స్ వంటి కేటగిరీల్లో నేషనల్ అవార్డు దక్కించుకోవడంతో ఆ సినిమా టీమ్ కూడా హ్యాపీగా ఉంది.
ఇంకా.. అల్లు అర్జున్ పుష్పతో అంతర్జాతీయంగా టాలీవుడ్‌కి ఎంత క్రేజ్ సంపాదించాడో.. అంతే స్థాయిలో దేవిశ్రీకి కూడా క్రెడిట్ దక్కుతుంది. ఆ సినిమాలోని పాటలకు ప్రపంచమే ఊగిపోయింది. అందుకే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీని జాతీయ అవార్డు వరించింది. బెస్ట్ తెలుగు ఫిల్మ్‌గా ఉప్పెన.. ఇది మాత్రం ఎవరూ ఊహించి ఉండరు. ఈ సినిమాకు అవార్డు రావడానికి కారణం.. ఈ సినిమా సాధించిన విజయమే. చిన్న సినిమాగా విడుదలై.. దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందంటే.. తెలుగు ప్రేక్షకులు మెచ్చారు కాబట్టే. అందుకే జ్యూరీ ఈ సినిమాని సెలక్ట్ చేసి ఉంటారు. ఇక ఆస్కార్ స్థాయిలో ఇండియన్ సినిమాకు గుర్తింపు రావడానికి కారణమైన వారిలో చంద్రబోస్ ఒకరు. ఆయనని పక్కన పెట్టేస్తే.. అవమానించినట్లే. అలా భావించి ఉంటారు కాబట్టే.. ఆయన ప్రాణం పెట్టి రాసిన పాటను గుర్తించి మరి అవార్డు ఇవ్వడమనేది నిజంగా గొప్ప విషయం. కొండపొలంలోని ఆ పాటని ఇప్పుడు వింటే.. చంద్రబోస్ ఈ అవార్డుకు అర్హుడు అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. మరో విషయం ఏమిటంటే.. ‘నాటు నాటు’ పాట పాడిన సింగర్స్‌లో ఒకరైన రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడటం. మొత్తంగా చూస్తే.. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ విజేతగా నిలిచిన వారందరికీ ఈ జాతీయ జాబితాలో చోటు కల్పించారనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఏదైతేనేం.. జాతీయ అవార్డు విషయంలో టాలీవుడ్ కరువు తీరిపోయిందని మాత్రం చెప్పుకోవచ్చు.