టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేడు 193వ రోజుకు చేరుకుంది. ఇక యాత్ర నేడు ఏలూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని టీడీపీ.. ఎక్కడైతే ఓటమి పాలయ్యారో అక్కడే విజయకేతనం ఎగురవేయాలని నారా లోకేష్ తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు. నిజానికి మంగళగిరి నియోజకవర్గంలో 1983, 85 తర్వాత టీడీపీ ఎప్పుడూ గెలవలేదు. కాబట్టి అలాంటి చోట గెలిచిచూపించాలని నారా లోకేష్ పట్టుదలగా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా ఆయనకు అనుకూలంగానే ఉన్నాయి. మంగళగిరిలో జనం ఆయనకు నీరాజనం పలికారు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఆయన కోసం వెయిట్ చేశారు. ఇలాంటి తరుణంలో ఓ ఇబ్బందికర పరిణామం.
గన్నవరం నియోజకవర్గంలో పలు చోట్ల జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, భారీ బ్యానర్లు దర్శనమిచ్చాయి. నిజానికి టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలని ఎప్పటి నుంచో ఓ వర్గం కోరుతోంది. మరి ఆ వర్గమే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిందా? లేదంటే కలతలు సృష్టించేందుకు ప్రత్యర్థి పార్టీలు ఇలా స్కెచ్ గీశాయా? అనేది తెలియలేదు. కానీ గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో సైతం ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. చంద్రబాబు సమక్షంలోనే ఎన్టీఆర్‌కు అనుకూలంగా పలువురు టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇంతకూ అసలు ఆ వర్గాన్ని రెచ్చగొడుతున్నదెవరు? నిజానికి జూనియర్ ఎన్టీఆర్‌కు సైతం టీడీపీ పగ్గాలు చేపట్టాలనే యోచన అయితే లేదు. అలాంటిది ఓ వర్గం ఎందుకు ఇంతలా ఈ అంశాన్ని హైలైట్ చేస్తోంది?. ఇంత జరుగుతున్నా ఎప్పుడూ జూనియర్ పట్టించుకోలేదు. దీంతో ఎన్టీఆర్ టీడీపీకి ఇబ్బందికరంగా మారిన పరిస్థితి.
ఇదే ఎన్టీఆర్ జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కంచికచర్ల మండలం పరిటాలలో గతంలో టీడీపీ నిర్వహించిన రైతు పోరు సభలో కూడా జూనియర్ జెండాలు ఎగిరాయి. ఒకవైపు కుప్పంలో పోటీ చేస్తే తేలిగ్గా ఉంటుందని చంద్రబాబు అంటే.. అందరిలాగా కంచుకోటకు వెళితే.. కష్టంగా ఉన్న చోట ఎలా గెలుస్తామని అన్నానని.. ఎప్పుడూ గెలవని సీటు ఇస్తే గెలిచి చూపించి నాయకుడిగా నిరూపించుకుంటానని చెప్పానని నారా లోకేష్ చెబుతున్నారు. ఆయన ఇంత పట్టుదలగా ఉన్నప్పుడు టీడీపీలోని కొందరు ఇలాంటి పనులు చేయడం ఎంతవరకూ సబబు? పోనీ ఎన్టీఆర్ ఏమైనా సినిమాలు వదిలేసుకుని రాజకీయాల్లోకి వచ్చేస్తాడా? అంటే అది కూడా అసాధ్యం. మరి అలాంటప్పుడు ఇలాంటి రగడలెందుకని పార్టీలోని మరికొందరు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారి కారణంగా పార్టీ అసలు లక్ష్యం దెబ్బతింటుందని చెబుతున్నారు.