కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్సార్‌టీపీ విలీనం జరగబోతోందంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ క్రమంలోనే అభ్యర్థుల జాబితా.. ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి? వంటి అంశాలుంటాయి. అందునా ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ నాలుగు స్థానాలు మినహా తమ అభ్యర్థులను జాబితాను ప్రకటించేసింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముందుగా కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే అటు షర్మిలతో పాటు ఇటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్కకు హస్తినకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
అటు కాంగ్రెస్.. ఇటు వైఎస్సార్‌టీపీ పార్టీల ఇద్దరి లక్ష్యం ఒక్కటే. కేసీఆర్‌ను గద్దె దించాలి. లక్ష్యం ఒక్కటే కావడంతో వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు షర్మిల సిద్ధమయ్యారు. అలాగే స్వాగతించేందుకు రాహుల్ సైతం సిద్ధం. ఈ మేరకు షర్మిల గత రెండు నెలలుగా పార్టీ అగ్రనేతలతో జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇచ్చాయి. మొత్తానికి పార్టీ విలీనానికి ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ నెల 28 న ఢిల్లీలో అందుబాటులో ఉండాలని షర్మిలకు ఎఐసీసీ తో పాటు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి కూడా సమాచారం అందినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ క్రమంలోనే తమ పార్టీ ముఖ్య నేతలకు.. ఏఐసీసీ సూచనల మేరకు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సమాచారం అందించినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ అధిష్టానం 28వ తేది అందుబాటులో ఉండాలని సూచించడంతో ఒకరోజు ముందే పార్టీ ముఖ్యనేతలతో ఢిల్లీకి వెళ్లాలని షర్మిల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు షర్మిల సేవలను ఏవిధంగా కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. షర్మిల సేవలను తెలంగాణతో పాటుగా ఏపీలో కూడా వినియోగించుకునేలా ఆమెను ఒప్పించిందని సమాచారం. తెలంగాణలో తొలుత ఆమె పాలేరు స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఆమెను సికింద్రాబాద్ నుంచి బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. అలాగే ఏపీలో ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా షర్మిలను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపనుంది. వైసీపీ ఓట్ బ్యాంక్‌ను తమ వైపు తిప్పుకోవటమే లక్ష్యంగా షర్మిల ప్రచారం చేయనున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. జగనన్న వదిలిన బాణాన్ని తిరిగి కాంగ్రెస్ అన్నపైకే ప్రయోగిస్తోంది.