ఏపీలో ఓ న్యూస్ తెగ సర్క్యులేట్ అవుతోంది. అదేంటంటే.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి గత ఎన్నికల్లో వెన్నుదన్నుగా ఉండి.. వ్యూహాలకు పదును పెట్టి.. కోడికత్తితో జాగ్రత్తగా పొడిపించి మరీ అధికారంలోకి తీసుకొచ్చిన ప్రశాంత్ కిషోర్‌ని ఇప్పుడు ఆయన వద్దనుకుంటున్నారట. ఇందులో పెద్ద వింతేం లేదు. వాడుకుని వదిలేయడం జగన్‌కు అలవాటే.. ఇంకా మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టడం.. వ్యక్తిత్వంపై బురద చల్లించడం వెరీ కామన్. ఇది ఇప్పటికిప్పుడు జరుగుతున్న తంతు కాదు.. నాటి మైసూరారెడ్డి నుంచి నేటి హిందూపురం మున్సిపల్ చైర్మన్ వరకూ జరిగిందిదే. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ పైనా వైసీపీ ఇదే వ్యూహాన్ని అమలు పరుస్తోంది.
ఒక్క తెలుగులోనే కాదు.. ఆంగ్ల మీడియానూ ఇష్టానుసారంగా వాడుకోగల దిట్ట జగన్. టైమ్స్‌ను అలా వాడుకునే కదా.. తన పార్టీకి అన్ని సీట్లు వస్తాయ్.. ఇన్ని సీట్లు వస్తాయంటూ ఊదరగొడుతున్నారు. ఇప్పుడు పీకే ఐప్యాక్‌పై కూడా అసత్య ప్రచారానికి ఆంగ్ల మీడియాను వాడేసుకుంటోందని టాక్. సరే.. ఏమైనా చేసుకోనివ్వండి కానీ మరో ఆసక్తికర రూమర్‌కి సైతం ప్రాణం పోసే పనిలో ఉంది వైసీపీ.తాను వాడుకుని వదిలేసిన ఐ ప్యాక్‌ను టీంను వాడుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారట. ఈ మేరకు దీదీతో అదేనండీ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ద్వారా ఐ ప్యాక్‌తో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇది ఒక ఆంగ్ల మీడియాలో వచ్చిన కథనం. నవ్విపోదురుగాక..
ఇప్పటి వరకూ మేం చేయించిన సర్వేలను.. తమ వ్యూహాలను టీడీపీకి లీక్ చేసిందంటూ మరో కొత్త ప్రచారం. అసలు విషయం ఏంటంటే.. ఈ మధ్య ఐప్యాక్ ఇచ్చిన ఐడియాలన్నీ బెడిసి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐ ప్యాక్‌ను వదిలించుకోవాలి.. జనాల్లో టీడీపీకి ప్రశాంత్ కిషోర్ అండగా ఉన్నారనే అసత్యాన్ని నాటేయాలి. ఇది స్కెచ్. దీనికోసం బాగానే వర్కవుట్ చేస్తోంది. చివరకు పీకే సంస్థకి క్యారెక్టర్ లేదనే వరకూ వెళ్లిపోయింది. ఎవరైనా సరే.. ఒక వ్యూహకర్తను పెట్టుకోవాలంటే.. రేపో మాపో ఎన్నికలున్నాయి అన్నప్పుడు పెట్టుకుంటారా? అది కూడా చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయట. మరెప్పుడు పూర్తవుతాయి? ఎన్నికలు అయిపోయాక? టీడీపీ పక్కా స్ట్రాటజీతో బరిలోకి దిగింది. దాన్ని దెబ్బకొట్టాలంటే ఇలాంటి కథనాలన్నీ సృష్టించేసి.. ఎలాగూ సోషల్ మీడియా వింగ్ బాగా స్ట్రాంగ్ కాబట్టి దానితో ప్రచారం చేయించాలి. అంతా బాగానే ఉందికానీ జనాలను వెర్రోళ్లు అనుకోవడమే వైసీపీ వెర్రితనం.